జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తీవ్ర వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయనపై విమర్శ చేయాలనుకున్న ప్రతిసారీ…. ఆయన మూడు పెళ్లిళ్ల గురించి తీసుకువస్తారు. సీఎం జగన్ దగ్గర నుంచి.. వైసీపీ నేతలంతా ఆ మాట మీదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో..తాను అసలు మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో… ఆయన వివరించారు. బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా వచ్చిన ఆయనను… ఈ విషయంపై బాలయ్య ప్రశ్నించారు. దానిని పవన్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
‘నేను అస్సలు పెళ్లి చేసుకోవాలనుకోలేదు జీవితంలో. బ్రహ్మచారిగా ఉండిపోవాలి. యోగమార్గంలో కలిసిపోవాలి అనుకున్నా. అక్కడ నుంచి నా జీవిత ప్రయాణం చూస్తే నాకే ఇలా జరిగిందా అనిపిస్తుంది. నేను చాలా సంప్రదాయంగా బతికే వ్యక్తిని.’ అని పవన్ చెప్పారు.
‘మొదటి సంబంధం ఇంట్లో వాళ్లు చూశారు. రిలేషన్ షిప్లో కొన్ని కుదరలేదు కాబట్టి వాళ్లు విడిపోయారు (తమ గురించే). రెండో సారి చేసుకున్నప్పుడు కూడా అభిప్రాయ భేదాల్లాంటివి వచ్చాయి. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం రాలేదు. అవి వేరే పరిస్థితులు. అందరూ మూడు పెళ్లిళ్లు అంటుంటే, ముగ్గుర్ని ఒకేసారి చేసుకోలేదురా బాబూ. ముగ్గురితో ఒకేసారి ఉండలేదు. ఒక వ్యక్తికో కుదరలేదు. రెండో సారి చేసుకున్నాను. వాళ్లతో కూడా కుదరలేదు. ఇంకోసారి చేసుకున్నాను. నేను కోరికతోనో, వ్యామోహంతోనో చేసుకోలేదు. అలా జరిగాయి అంతే.’అని ఆయన అన్నారు.
‘రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శించడానికి అది ఒక ఆయుధం అయింది. నేను కూడా అవి పెద్దగా పట్టించుకోను. లోపల నాకు ఆ విషయంలో గిల్టీ ఫీలింగ్ లేదు. నేను చాలా మంది అధికారులను చూశాను. నన్ను విమర్శించే నాయకుల వ్యక్తిగత జీవితాలు చూశాను. నాకంటే ఇంట్రస్టింగ్‌గా ఉంటది వాళ్ల పర్సనల్ లైఫ్. కానీ నా సంస్కారం మాట్లాడనివ్వదు. నేను ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదమ్మా. కుదరక అలా అయింది. నేను విడాకులు ఇచ్చాకనే ఇంకో వివాహం చేసుకున్నాను. ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకుని, ముగ్గురిని ఒకే ఇంట్లో పెట్టి అలా చేయలేదు. ఒకరి మీద నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. కానీ నాకు సంస్కారం, సభ్యత ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే గొడవల కారణంగానే అలా అయింది. అంతకు మించి ఇంకేం ఉంటది.’ అని సమాధానం ఇచ్చారు.