తన తండ్రి బెడ్ మీద మూత్రం పోశాడని అతడి గొంతు నులిమి చంపేశాడు కొడుకు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆనంద్ పర్బట్ ఏరియాలో ఉండే జితేంద్ర శర్మకు పక్షవాతం వచ్చింది. దీంతో బెడ్ మీది నుంచి లేచి నడవలేడు. 2020లో ఆయనకు పక్షవాతం వచ్చింది. అంతకుముందు ఆటోరిక్షా నడిపేవాడు. అయితే.. మద్యం బాగా తాగే అలవాటు ఉన్న జితేంద్ర.. రోజూ తాగి వచ్చి భార్యను వేదిస్తున్నాడని భార్య కూడా అతడిని వదిలి వెళ్లిపోయింది. దీంతో అతడిని కొడుకే దగ్గరుండి చూసుకుంటున్నాడు.
పక్షవాతం వచ్చినా మద్యం తాగే అలవాటు మాత్రం పోలేదట జితేంద్రకు. గత శుక్రవారం కూడా శర్మ పక్కింటి వ్యక్తి, తన కొడుకుతో కలిసి ఉదయం నుంచి మద్యం తాగాడట. సాయంత్రం అయ్యాక.. మద్యం మత్తులో బెడ్ మీదనే మూత్రం పోశాడట. మద్యం మత్తులో ఉన్న తన 20 ఏళ్ల కొడుకు సుమిత శర్మకు తండ్రి చేసిన వ్యవహారం చూసి కోపం వచ్చింది. ఇంత పని చేస్తావా అని ఆగ్రహంతో ఊగిపోయి జితేంద్ర గొంతును నులిమేశాడు. దీంతో జితేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తండ్రిని చంపిన తర్వాత పక్కింటి వ్యక్తి తన తండ్రిని చంపాడని పోలీసులకు అబద్ధం చెప్పాడు సుమిత్. కానీ.. పోలీసులకు సుమిత్ మీద అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించడంతో అతడు చేసిన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.