Cricket Betting: విశాఖలో రూ.350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా..షాకైన సైబర్ పోలీసులు
అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబర్ పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఆ దందా ద్వారా సుమారు రూ.350 కోట్ల బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
విశాఖ (Visakhapatnam)లో భారీ క్రికెట్ బెట్టింగ్ (Cricket Betting) ముఠా దందాను సైబర్ పోలీసులు (Cyber Police) గుట్టురట్టు చేశారు. విశాఖ కేంద్రంగా రూ.350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ జరుగుతోన్న విషయాన్ని తెలుసుకుని తమ దైన శైలిలో విచారణ చేపట్టారు. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరిబాబులతో పాటుగా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ చేపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ.145 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు తెలుసుకుని షాక్ అయ్యారు. నిందితుల నుంచి నగదు, సెల్ఫోన్లు, ల్యాప్ టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ పోలీసులు వెల్లడించారు. ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయకులు చిక్కుకున్నారన్నారు. ఈ కేసును సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు.
క్రికెట్ బెట్టింగ్ నడిపించే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్కు చెందిన బుకీలతో విశాఖకు చెందిన కొందరు ప్రముఖులు సంబంధాలు పెట్టుకున్నట్లు తేలిందని, ఆ దిశగా తమ దర్యాప్తును రహస్యంగా సాగిస్తున్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. బెట్టింగ్లో పందేలు కాసేవారు బుకీల వద్ద కోడ్ భాషను వాడి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతున్నారన్నారు. బెట్టింగ్ రాయుళ్ల కోడ్ లాంగ్వేజ్ వాడి ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బెట్టింగులకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా యువతను హెచ్చరించారు.