»One Person Died After Eating Prasadam 70 People Are Serious
Karnataka: ప్రసాదం తిని ఒకరు మృతి..70 మందికి సీరియస్!
ఆలయం వద్ద ప్రసాదం తిని ఒకరు మృతి చెందగా మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉన్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐసీయూలో మరికొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రసాదం తిని ఒకరు మృతిచెందగా మరో 70 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోటేలో చోటుచేసుకుంది. ఓ ఆలయం వద్ద ప్రసాదం పంచి పెట్టారు. ఆ ప్రసాదం తిన్న మహిళ మృతిచెందింది. ప్రసాదం తిన్న మరో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వేర్వేరు ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల కథనం మేరకు..హోస్కోటేలోని ఓ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే రోజు మాదిరిగానే ఆలయం వద్ద ప్రసాదాన్ని పంచిపెట్టారు. ప్రసాదాన్ని సేవించిన భక్తులు ఆ తర్వాత తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే 70 మంది దాకా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
చాలా మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరినట్లుగా పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఓ మహిళ సోమవారం ఉదయం మృతి చెందిందని, మరికొందరు ఐసీయూలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రసాదం సేవించని వారికి ఎలాంటి వాంతులు, విరేచనాలు కాలేదని అధికారుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.