Nightclub Fire: బర్త్‌డే పార్టీలో విషాదం.. 11 మంది దుర్మరణం
బర్త్ డే పార్టీలో అగ్నిప్రమాదం జరగడంతో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 40 ఫైర్ ఇంజిన్లు, 12 ఎమెర్జెన్సీ వాహనాలతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బర్త్ డే పార్టీలో విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు పార్టీలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా 11 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన స్పెయిన్ లోని ముర్సియ నైట్ క్లబ్ (Nightclub Fire)లో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఫాండా మిలగ్రోస్గా పిలిచే టీట్రే నైట్ క్లబ్లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నైట్ క్లబ్ భవనం పైకప్పు నుంచి పొగ భీకరంగా వ్యాపించింది. శనివారం రాత్రి బర్త్ డే పార్టీ జరగ్గా ఆ వేడుకకు హాజరైన మరికొందరి ఆచూకీ ఇంకా గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. నైట్‌క్లబ్ ఫస్ట్ ఫ్లోర్లో అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు గాయాలపాలయ్యారు. మరికొందరు పొగను పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారని, 40 అగ్నిమాపక యంత్రాలు, 12 అత్యవసర వాహనాలతో సహాయక చర్యలు చేపట్టినట్లు ముర్సియ మేయర్ జోస్ బలెస్ట వెల్లడించారు.