ఇండోనేషియాలోని చైనాకు చెందిన నికెల్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు. సులవేసి ద్వీపంలోని మొరోవాలి ఇండస్ట్రియల్ పార్క్లో ఈ దారుణ ఘటన జరిగింది. నికెల్ తయారీ యూనిట్లో పని చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో దాదాపు 13 మంది కార్మికులు మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో మరో 38 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. భారీ పేలుడు సంభవించడంతో లోపల అంతా దట్టమైన పొగ అలముకుంది. అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఎనిమిది మంది ఇండోనేషియాకు చెందిన వారు కాగా మరో ఐదుగురు చైనాకు చెందిన కార్మికులుగా పోలీసులు గుర్తించారు. కొలిమికి మరమ్మతులు నిర్వహించే సమయంలో ఈ పేలుడు సంభవించిందని, అక్కడే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉండడంతో వాటి ప్రభావం తీవ్రతరమైందని పార్క్ అధికారి వెల్లడించారు.