»Bus And Tractor Collision In Ap Anantapur District Four People Died
Accident: ఢీకొన్న ట్రాక్టర్, బస్సు..నలుగురు మృతి
దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, ఓవర్ టేకింగ్ , మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయాలపాలవుతున్నారు. తాజాగా శనివారం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
bus and tractor collision in ap anantapur district four people died
ఏపీలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు అతివేగంతో వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను పసలూరు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్‌లుగా గుర్తించారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. రైస్‌మిల్లు నుంచి బియ్యం బస్తాలను ట్రాక్టర్లో ఎక్కించుకుని గుత్తికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వోల్వో బస్సు అతివేగంతో ఢీకొనడంతో రోడ్డుకు అడ్డంగా బియ్యం బస్తాలు కూడా ఎగిరిపోయాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఓల్వో బస్సు అతివేగంతో ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.