»New Ration Cards Process In Telangana From December 28th 2023
Telangana:లో ఈనెల 28 నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ షురూ
తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్, పెన్షన్లు, గృహ సంబంధిత అభ్యర్థనల పంపిణీని ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో డిసెంబరు 28 నుంచి ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనుంది.
new ration cards process in telangana from december 28th 2023
తెలంగాణలో ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పేదల కల సాకారం కాబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబరు 28 నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై గ్రామసభలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం హయాంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉన్న కార్డుల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తుదారులు నిరీక్షిస్తూనే ఉన్నారు. రేషన్‌తోపాటు ఆరోగ్యశ్రీ, ఇతర సేవలకు రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది పేదలు సేవలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు లేకపోవడం, ఉన్న వాటిల్లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆరోగ్యశ్రీ పథకాన్ని పొందలేకపోతున్నారు. అత్తగారింటి నుంచి కోడలు పేరు, పుట్టిన పిల్లల పేర్లు చేర్చే అవకాశం లేకపోవడంతో పలు సేవలకు దూరమవుతున్నారు. గతంలో రూపాయికే కిలో బియ్యం ఇచ్చేవారు. ఆహారభద్రత కార్డులో పేరున్న సభ్యునికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకపోవడం, పిల్లల పేర్లు చేర్చే అవకాశం లేకపోవడంతో వేలాది కుటుంబాలు కూడా ఈ ఉచిత బియ్యానికి దూరమవుతున్నాయి.
కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ఒక్కో జిల్లా నుంచి దాదాపు 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది కాకుండా ఆహార భద్రత కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం ఆయా జిల్లాల్లో 60 వేల నుంచి 90 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామాల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.