»Husband Commits Suicide Because His Wife Is Making Reels Incident In Guntur
Social Media Reels: భార్య రీల్స్ చేస్తోందని భర్త ఆత్మహత్య..గుంటూరులో ఘటన
భార్య రీల్స్ పిచ్చి భరించలేక, ఆ రీల్స్ చూసి తన భార్యను అందరూ చెడుగా మాట్లాడుకోవడం సహించలేక మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈరోజుల్లో పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ సోషల్ మీడియా (Social Media) ప్రభావం భారీగా ఉంది. వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియాలో చూపుతూ ఆనందపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ కొన్నిసార్లు భారీ తప్పిదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఓ భార్య రీల్స్ (Reels) పిచ్చికి అలవాటు పడటంతో భరించలేని భర్త ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా (Guntur District)లోని తాడికొండ మండలంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల మేరకు.. నిడుముక్కల గ్రామానికి చెందిన వీరయ్యకు, ద్రాక్షావల్లికి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లి అయిన కొన్నాళ్లకు వారి కాపురం సజావుగా సాగింది. అయితే వారి మధ్య గొడవలు మెల్లగా మొదలయ్యాయి. దీంతో గత ఏడేళ్లుగా వారిద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్రాక్షావల్లి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ రీల్స్ (Social Media Reels) చేసేది. తన ఫోటోలు పెట్టడంతో పాటుగా వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునేది. అయితే ఆమె వీడియోలను స్థానికులు కూడా ఎక్కువ మంది చూసేవారు.
ద్రాక్షవల్లి వీడియోలను (Videos), రీల్స్ (Reels)ను చూసినవారంతా ఆమె గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వీరయ్య స్నేహితులు కూడా ఆమె గురించి తప్పుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. వారి మాటలను భరించలేని వీరయ్య తన భార్యపై మరింత కోపాన్ని పెంచుకున్నాడు. అంతేకాకుండా ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం కూడా వీరయ్యకు బాగా పెరగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వీరయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
తన బాధను ఎవరికీ చెప్పుకోలేక తనలోతానే మదనపడుతూ వీరయ్య ప్రాణాలు వదిలాడు. అక్టోబర్ 9వ తేదిన వీరయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకోగా బంధువులు ఆయన్ని కాపాడి ఆస్పత్రిలో చేర్చారు. గుంటూరు జీజీహెచ్ (Guntur GGH)లో చికిత్స పొందుతూ వీరయ్య ప్రాణాలు వదిలాడు. వీరయ్య బంధువుల ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.