పట్టపగలే బ్యాంకు సిబ్బందిని గదిలో వేసి బంధించి రూ.7 కోట్ల నగదును దోచుకెళ్లిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌గఢ్‌లో చోటుచేసుకుంది. రాయ్‌గఢ్‌లోని యాక్సిక్ బ్యాంక్ జగత్‌పుర్ శాఖలో భారీ దొంగతనం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం ఉదయం 9.30 గంటలకు సిబ్బంది బ్యాంకును తెరిచారు. ఉద్యోగులు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు.
బ్యాంకు సిబ్బందిని కత్తితో బెదిరించి బ్యాంక్ మేనేజర్‌ను గాయపరిచారు. లాకర్ తాళం తీసుకుని బ్యాంకు సిబ్బందిని, సెక్యూరిటీ గార్డును ఓ గదిలో వేసి బంధించారు. ఆ తర్వాత లాకర్ గదిలోకి వెళ్లి రూ.7 కోట్ల నగదు, రూ.కోటిన్నర వివులైన బంగారాన్ని బ్యాగులో పెట్టుకుని పరారయ్యారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మేనేజర్ పరిస్థితి నిలకడగానే ఉంది.
పక్కా ప్రణాళికతోనే ఈ దొంగతనం జరిగిందని, ప్రొఫెషనల్ ముఠాలే ఈ పని చేస్తాయని బిలాస్పూర్ ఐజీ అజయ్ యాదవ్ తెలిపారు. ఈ కేసులో ఫేక్ నంబర్ ప్లేట్ ఉన్న ఓ బైక్ దొరికిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో బీహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల చెకింగ్ పాయింట్లను అప్రమత్తం చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఐజీ అజయ్ యాదవ్ తెలిపారు.