KMM: తక్కువ ప్రీమియంతో ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి బీమా పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డీసీసీబీ బ్రాంచ్ సిబ్బంది సూచించారు. తల్లాడ డీసీసీబీ బ్రాంచ్లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద లబ్ధిదారుని కుటుంబానికి రూ. 2,00,000 చెక్కును బ్యాంకు అధికారులు నేడు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
MLG: మంగపేట (M)మొట్లాగూడెంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పై AEO మహేష్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. AEO మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందులకు బదులుగా జీవామృతం, పంచామృతం, అగ్నీ అస్త్రం, నీమాస్త్రం వంటి సహజ ఎరువులను స్వయంగా తయారు చేసుకుని వాడాలని సూచించారు. ఈ పద్ధతులతో భూసారం పెరగడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయన్నారు.
KMR: కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి అడిషనల్ వైద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిడ్నీ పనితీరుపై ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ పనితీరును ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ సెంటర్ మేనేజర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లకు నీటి సరఫరా సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని వార్డు మెంబర్ మధు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సొంత ఖర్చుతో మోటార్ మరమ్మతులు చేయించి బోరు బావిలో దింపించారు. దీంతో నీటి సమస్య పరిష్కారమైంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
MDCL: అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి డివిజన్ పరిధి హకీంపేట్ సమీపంలోని రైల్ నగర్ కాలనీ సబ్‌లైన్‌లలో రూ.28 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రారంభించారు. అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
SRD: ప్రతి ఇంటి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. కందిలోని ఓ కన్వెన్షన్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు.
SDPT: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని సిద్దిపేట నియోజకవర్గ ఇంఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. గురువారం అర్బన్ మండలం తడకపల్లిలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉపాధి కూలీల పని దినాలు తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.
SRPT: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని మున్సిపల్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి గురువారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు, చిరు వ్యాపారస్తులు, రవాణా వ్యవస్థకు అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు వెంటనే నిర్మాణాన్ని రద్దు చేయాలన్నారు.
NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి గురువారం సీబీఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు నోటీసులు ఇవ్వడానికి ఆమె ఇంటికి అధికారులు చేరుకున్నారు. దీంతో ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
MNCL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలలోని ప్రజాప్రతినిధులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జైపూర్ మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు పాల్గొన్నారు. వేలాల సర్పంచ్ డేగ స్వప్నతో పాటు కుందారం, పౌనూరు, శెట్‌పల్లి, నర్వ, కాన్కూర్, తదితర గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు శిక్షణకు హాజరయ్యారు.
KMM: ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డుల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు పాత్ర పోషించాలని అన్నారు.
SRD: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. గ్రామంలో ఏ వీధి చూసిన బంధువులతో కిక్కిరిసిపోయాయి. గుడి ప్రాంతమంతా భక్తి పరవశంతో మునిగిపోయింది.
KNR: జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. గురువారం రూ. 10 పెరిగి రూ. 7,500 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు రైతులు 13 వాహనాల్లో 98 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పు కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
GDWL: ఈనెల 15వ తేదీన బడంగ్ పేటలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహుజన రాజకీయ యుద్ధభేరి సభకు సంబందించిన కరపత్రాలను గురువారం ధరూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర విడుదల చేశారు. ఈ సందర్బంగా గద్వాల అసెంబ్లీ కార్యదర్శి సోంపురం దేవన్న మాట్లాడుతూ.. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకొని సభ జరుగుతుందని ఆయన అన్నారు.