WNP: 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక 10 థీమ్‌ల వారిగా విభజించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట సమయంలో అమలు చేస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకలను అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి సుజాత గురువారం తనిఖీ చేశారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో CPR చేసే విధానంపై ఎస్ఈడీ స్క్రీన్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ లింగాపూర్ గ్రామంలో ఇవాళ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 103 మందికి బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వేసవికాలంలో ప్రజలు తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలను వైద్యులు వివరించారు. సింగరేణి అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
NZB: అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో ఇందల్వాయి రైల్వేగేట్ ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గేట్ మూసివేయనున్నట్లు చెప్పారు. ఇందల్వాయి నుంచి ధర్పల్లి, సిరికొండ, భీమ్గల్ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు డిచ్పల్లి, కమలాపూర్, తిర్మన్పల్లి మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని అధికారులు సూచించారు.
RR: చేవెళ్ల పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు అగ్నిమాపక భద్రతపై అవగాహన కల్పించేందుకు ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిని ఎలా నివారించాలనే విషయాలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో అగ్ని ఎలా అదుపులోకి తేవాలని ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు.
WGL: నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో SC సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
VKB: ఎండల వేడిమితో పాఠశాల విద్యార్థులు తట్టుకోలేరని ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 16 నుంచి ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నామని ఎంఈవో అభిబ్ హమద్ తెలిపారు. కుల్కచర్ల మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. ఈనెల 14 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు.
SRCL: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీపీహెచ్‌సీని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, మందుల గది, ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. వ్యాక్సిన్లు, మందుల నిలువుపై ఆరా తీశారు.
MDCL: అల్వాల్ రాజు రహదారి రోడ్డు విస్తరణను 150 ఫీట్లు తగ్గించాలని జేఏసీ నాయకులు కోరారు గురువారం అల్వాల్ సర్కిల్ శుభశ్రీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు విస్తరణను 150 ఫీట్లకు తగ్గించాలని, నష్టపరిహారాన్ని మూడు రెట్లు పెంచాలని కోరుతూ.. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికు వినతిపత్రాలు అందజేశారు.
KNR: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ 8వ డివిజన్ (అల్గునూర్) అధ్యక్షుడిగా యస్వాడ శ్రీకాంత్ నియామకమయ్యారు. ఈ మేరకు ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు కందుకూరి సాయికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన జిల్లా ఛైర్మన్ ఓరుగంటి ఆనంద్, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో ఇవాళ జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 14 మంది విద్యార్థులు హాజరు కాలేదు. వీరిలో వోకేషనల్ నుంచి నలుగురు, జనరల్ విభాగం నుంచి పదిమంది ఉన్నట్లు పరీక్షల నిర్వహణ అధికారి వాణి తెలిపారు. ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
MNCL: కోటపల్లి మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన నోటీస్‌ను పోలీసులు గురువారం అందించారు. ఎరినాగుల ఓదెలు, మారిశెట్టి విద్యాసాగర్, పెద్దపోలు సాంబగౌడ్, కొట్టె నారాయణ, పిల్లి సమ్మయ్య, ఆసంపల్లి సంపత్ కుమార్, రాళ్లబండి స్వామి, బోగే మంథయ్య, గుగ్లోత్ బాపు నాయక్‌లపై కేసు నమోదు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
MHBD: MP పోరిక బలరాం నాయక్ ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MHBD పరిధిలోని పలు జాతీయ, రాష్ట్ర రహదారుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న NH అనుమతులు త్వరగా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు MP తెలిపారు.
SRD: పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వేలాది మహిళలు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
GDWL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం వెళ్తున్న పాదయాత్రికులకు అలంపూర్ న్యూ ప్లాట్స్ కాలనీ మహిళలు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న భక్తుల కోసం మహిళలు చందాలు వేసుకుని సేవా కార్యక్రమం చేపట్టారు. గత మూడు రోజులుగా వందలాది మంది భక్తులకు మజ్జిగ అందిస్తూ సేవలందిస్తున్నామని నిర్వాహకులు వరలక్ష్మి, ఇస్మాయిల్ బేగం, జ్యోతి తెలిపారు.