HNK: గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వరంగల్‌కు జరుగుతున్న అన్యాయం పట్ల పార్లమెంట్లో ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. 2025లో తీసుకొచ్చిన “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ)” చట్టం కింద 125 రోజుల ఉపాధి హామీ అమలు ఇంకా ప్రారంభం కాలేదని, వెంటనే ఈ హామీని అమలు చేయాలని, తెలంగాణలో పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు.
ASF: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ చునర్కర్ సతీష్ ఆధ్వర్యంలో వారసంతకు వేలం నిర్వహించారు. వేలం పాటలో ఇద్దరు పాల్గొనగా రూ.9.51 లక్షలకు శంకర్ దక్కించుకున్నాడు. గాతేడాది రూ.8.49 లక్షలు పల్కగా ఈసారి రూ.1 లక్ష 2 వేలు అధికంగా గ్రామ పంచాయతీకి ఆదాయం పెరిగింది. ఈ కార్యక్రమంలో వాంకిడి ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
JGL: జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలోని శానిటేషన్ వాహనాల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ వద్ద వాహనాలను ఆమె స్వయంగా పరిశీలించారు. సకాలంలో ఆయిల్ చేంజ్ చేస్తూ ఫిట్నెస్‌ను కాపాడాలని, మరమ్మతుల్లో ఉన్న వాహనాలను వెంటనే అందుబాటులోకి తేవాలని సూచించారు.
MDK: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ, ఇంట్రా గ్రిడ్, గ్రిడ్, ఇరిగేషన్, ఫారెస్ట్, ఆర్డబ్ల్యూఎస్ గ్రామపంచాయతీ, గ్రౌండ్ వాటర్, మున్సిపల్ కమిషనర్స్, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను మున్సిపాలిటీలో జరగబోయే పాలకవర్గ సమావేశంలో అత్యవసరంగా చర్చించి పరిష్కరించాలని హుస్నాబాద్ బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ పచ్ఛిమట్ల రవీందర్ గౌడ్ కోరారు. పట్టణంలో కోతుల సమస్య రోజు రోజుకు తీవ్రమవుతూ ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. కోతుల దాడిలో పలువురు గాయపడ్డా ప్రభుత్వ నుంచి ఎలాంటి చలనం లేదన్నారు.
ADB: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమురం భీమ్ కాలనీలో ఇంటి వద్ద గంజాయి సాగు చేస్తున్న గేడం జంగు (39) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై మధుకృష్ణ బృందం దాడి చేసి, సుమారు రూ.5,000 విలువైన 2 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
MBNR: గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా శ్రీవల్లి, ఉపాధ్యక్షులుగా పాలకొండ వెంకటేష్ గౌడ్, అక్షయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ హాజరై నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఘనంగా సత్కరించారు.
NZB: టీయూ పరిధిలో ఎం.ఎడ్ (M.Ed) 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు మంగళవారం నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం జరిగిన ‘ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పరీక్షకు 29 మంది విద్యార్థులకు 27 మంది విద్యార్థులు హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యా రని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు.
BDK: బూర్గంపాడు, సోంపల్లి మధ్యలో కిన్నెరసాని ఇసుక ర్యాంపు నుంచి లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఇవాళ ఆ లారీలను అడ్డగించి, లారీల వల్ల రోడ్లన్నీ పాడవుతున్నాయని, విద్యార్థులకు, వృద్ధులకు, రోడ్డు దాటే క్రమంలో ప్రమాదం పొంచి ఉందని వాపోతూ లారీలను అడ్డగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
NZB: వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయా శాఖల వారీగా అధికారులకు బాధ్యతలు పురమాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు.
BHNG: మోత్కూరు స్మశాన వాటికలో కనీస వసతులు లేవని బందెల శ్రీను ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. దహన సంస్కారాలకు రాత్రి వేళలో వీధి దీపాలు లేక, మహిళల స్నానాలకు నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. కోటి నిధులు మంజూరైనా అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని మండిపడ్డారు.
KNR: ఇల్లందకుంట మండలం పాతర్లపల్లిలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ బైరెడ్డి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 145 పశువులకు టీకాలు వేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
SRPT: విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని కోరుతూ టీపీటీఈ నాయకులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. పెన్షన్లు, కేజీబీవీ ఉద్యోగుల టైమ్ స్కేలు, ఉపాధ్యాయులకు డిజిటల్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
GDWL: జిల్లాలో చేనేత కలను నమ్ముకున్న కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో పర్యటించిన కలెక్టర్, చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి మగ్గాలను పరిశీలించారు. కార్మికులకు ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
MHBD: గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే ధ్యేయమని బ్రాహ్మణకొత్తపల్లి సర్పంచ్ డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో MGNREGS నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జెల్ల పరుశరాములు,తాళ్ళ మునేష్ తదితరులు పాల్గొన్నారు.