KNR: కరీంనగర్‌లో జనగణన ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రైనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. 855 మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు మూడు విడతల్లో శిక్షణ ఇచ్చి, గడువులోగా డేటా సేకరణ పూర్తి చేయాలన్నారు.
JN: పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ తండ్రి పసునూరి సత్యనారాయణ అనారోగ్యంతో ఇవాళ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పాడే మోశారు.
BDK: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుంజా ధర్మారావు ఆధ్వర్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ప్రజా వేదికలో ప్రకాష్ రాజ్ శ్రీరాముడు ఉత్తర భారతీయుడని, రామ-లక్ష్మణ-సీతలు లంకలో పండ్లు దొంగతనం చేయడం వలన యుద్ధం జరిగిందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, ఫిర్యాదులో పేర్కొన్నారు.
VKB: పరిగి మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోకుండా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నలను విక్రయించి రూ.2400ల మద్దతు ధర పొందాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్‌లో ఆదివారం విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్న కుడికిళ్ల గ్రామానికి చెందిన దినసరి కూలీ వెంకటేశ్ అనుకోకుండా కింద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRD: నిజాంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. సుమారు 25 ఏళ్ల తర్వాత స్నేహితులంతా ఒకేచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. పాత మిత్రుల పలకరింపుతో ప్రాంతమంతా సందడి నెలకొంది.
WNP: జిల్లాలో జనగణన ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని, ప్రతి ఇల్లు మరియు వ్యక్తి వివరాలను డిజిటల్ పద్ధతిలో ఖచ్చితంగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్‌లకు సూచించారు. దేశాభివృద్ధికి ఈ గణాంకాలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
KMM: ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల సాకుతో వైరా గురుకుల పాఠశాల ఆవరణలో వందలాది చెట్లను అడ్డగోలుగా నరికివేస్తున్నారని పర్యావరణ ప్రేమికులు నేడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి భారీ వృక్షాలను నేలమట్టం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. వందన నాటి వృక్షాలు నేలకూరడం బాధను కలిగించాయన్నారు.
VKB: పెద్దేముల్ మండల పరిధిలోనీ చైతన్య నగర్ గ్రామ శివారులో అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు ఆదివారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు.
SRPT: నూతనకల్ గ్రామంలోని 10వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు గ్రామ సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకై కృషి చేస్తానని, గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.
RR: ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆయన పాలనా దక్షతను కొనియాడారు. జన్మభూమి, డ్వాక్రా, రైతుబజార్ల వంటి వినూత్న పథకాలతో చంద్రబాబు ప్రజలకు చేరువయ్యారని పేర్కొన్నారు. గతంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫెన్ సన్, బిల్ క్లింటన్, టోనీ బ్లేయర్ వంటి అంతర్జాతీయ ప్రముఖులను షాద్‌నగర్ ప్రాంతానికి తీసుకువచ్చిన ఘనత ఆయనదేనని బక్కని గుర్తుచేశారు.
NRPT: పెద్దజట్రం గ్రామంలో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు సర్పంచ్ వాకిటి వెంకటేష్ శాశ్వత పరిష్కారం చూపించారు. ప్రధాన రహదారి వెంట కొత్తగా వీధిదీపాలను ఏర్పాటు చేయడంతో గ్రామం మొత్తం వెలుగులతో నిండిపోయింది. ఇప్పటి వరకు రాత్రి వేళల్లో చీకటివల్ల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులకు ఇది పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి పవన్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.
RR: నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని సాలార్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు.
ADB: ఉట్నూర్‌లలో సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. పదో తరగతి కోసం 4, ఇంటర్ కోసం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మొత్తం 1,484 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరవుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
JN: చిల్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వంట గదిని పరిశీలించి,ఆహార తయారీ విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అనే విషయం గురించి ఆరా తీశారు. భోజన నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.