WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం పట్టణంలోని ప్రభుత్వ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు వడ్డించే ముందు పర్యవేక్షకులు తప్పనిసరిగా ఆహారాన్ని రుచి చూడాలని ఆదేశించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల చెందిన బీజేపీ నేత జడ సతీష్ ఇటివల గుండెపోటుతో మరణించడంతో గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. సతీష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం, సానుభూతి తెలియజేశారు. బీజేపీ కోసం అహర్నిశలు కృషిచేసిన వ్యక్తి కాబట్టి వారి లోటు ఎల్లవేళలా తీర్చలేనిదని అన్నారు.
NRML: సారంగాపూర్ మండలంలోని చించోలి–బి గ్రామ మహిళా ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి పథకం పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, టీఎస్‌డబ్ల్యుసీడీసీ విజయలక్ష్మి పాల్గొని PMEGP,PMFME పథకాలపై వివరించారు.
PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో పత్తి ధరలు స్థిరంగా ఉన్నాయి. కనీస ధర రూ.5,302, గరిష్ట ధర రూ. 7,111, మోడల్ ధర రూ. 6,707గా నమోదైంది. మొత్తం 445 బ్యాగులు మార్కెట్ కు రాగా, 476.15 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. 173 మంది రైతులు తమ పత్తిని అమ్మకానికి మార్కెట్ కి తీసుకొచ్చారు. వ్యవసాయ మార్కెట్ లో ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు సాగాయి.
PDPL: రామడుగు మండల కేంద్రంలో ఈరెల్ల గౌరమ్మ (55) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. గౌరమ్మ భర్త కొమురయ్య, చిన్న కుమారుడు అనిల్ వ్యవసాయం చేస్తున్నారు. పెద్ద కుమారుడు మహేశ్ ఇటీవల జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. గౌరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
KMM: శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా మార్చి 6 నుంచి 7 వరకు మధిర బస్టాండ్ నుంచి పెనుగంచిప్రోలు వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ మధిర డీఎం ఆర్.రామయ్య గురువారం తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధిర, పరిసర ప్రాంతాల భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ADB: ఆదిలాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో మార్చి 10న ఏఆర్ హెడ్ క్వాటర్స్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 50కి పైగా కంపెనీలు పాల్గొని సుమారు 2000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 7వ తరగతి నుంచి ఉన్నత చదువులు చదివిన వారు అర్హులని, ఎంపికైన వారికి రూ. 13,000 నుంచి రూ.40,000 వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు.
MLG: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయం నుంచి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. 99 రోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి మౌలిక మార్పులు తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు.
MNCL: హాజీపూర్ మండలం ముల్కల్ల ప్రభుత్వ హై స్కూల్‌లో USFI ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గురువారం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్‌లో మండల వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు DEO యాదయ్య ప్రశంసాపత్రాలు, మెమెంటోలు బహుమతులు అందజేశారు.
BHPL: చిట్యాల మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో TRP పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బహుజనుల కోసం నిజాయితీగా కొట్లాడుతున్న TRP పార్టీకి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని, TRP పార్టీ విధానాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్లాలన్నారు.
నల్గొండ పట్టణంలోని, బొట్టుగూడ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి గురువారం సందర్శించారు. అత్యాధునికంగా నిర్మించిన పాఠశాలలో అన్ని తరగతి గదులను పరిశీలించారు. మంత్రి కోమటిరెడ్డి ద్వారా ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్‌తో ఎనిమిది కోట్లతో నిర్మించిన పాఠశాలలో తరగతి గదుల్లో గల సౌకర్యాలను, ఉపాధ్యాయుల భోదన గురించి తెలుసుకున్నారు.
JN: గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం (GMPS) 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు మోటే దేవేందర్, జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. జనగామ బీరప్ప గుడి ఆవరణలో GMPS ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించి మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
JGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా పని చేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీవో వాసవి, సూపరింటెండెంట్, పీఆర్ఏఈ పాల్గొన్నారు.
MBNR: ఈనెల 6న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి నివేదన కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా వెల్లడించారు. ఇవాళ ఈ విషయమై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు హాజరవుతారన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాల్లో గణితశాస్త్రం, జూలజీ, హిస్టరీ పరీక్షలు సజావుగా నిర్వహించబడ్డాయి. మొత్తం 8,640 మంది విద్యార్థులకు పరీక్షలు ఉండగా 8,219 మంది హాజరయ్యారు.