MBNR: జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
MDK: జహీరాబాద్ మండలం రంజోల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం పదవ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గుప్త తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆసక్తిగల విద్యార్థులు tspolycet.nic.in వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ కిట్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు మతాల మధ్య సోదర భావాన్ని పెంచుతాయని తెలిపారు. ఇఫ్తార్ విందులో ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి-563 నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా సమావేశం నిర్వహించారు.
PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మార్కండేయ కాలనీకి వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణ పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సోమవారం పరిశీలించారు. మూల మలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న రోడ్డును ప్రజలకు అనుకూలమైన పద్ధతిలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సోదరుడు, ఏఎంసీ ఛైర్మన్ ప్రకాశ్ రావు, మున్సిపల్ ఛైర్మన్ రాధాకృష్ణ పాల్గొన్నారు.
HYD: నగరంలో మహిళల భద్రత కోసం పనిచేస్తున్న షీ టీమ్స్ ఫిబ్రవరి నెలలో 88 ఫిర్యాదులపై స్పందించాయి. 141 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, 12 FIRలు నమోదు చేశాయి. ఈవ్ టీజింగ్, బ్లాక్ మెయిలింగ్, వేధింపుల కేసుల్లో కోర్టు జరిమానాలు విధించింది. 232 అవగాహన కార్యక్రమాలు, 1,002 నిఘా డ్రైవ్‌లు నిర్వహించిన షీ టీమ్స్, మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని హెచ్చరిస్తున్నాయి.
జగిత్యాల జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల యువతి, యువకులు స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ వాసులు రూ.1,50,000, పట్టణవాసులు రూ. 2,00,000లకు లోబడిన నాన్ అగ్రికల్చర్ సెక్టార్ పథకాలకు 21-50 సం.ల మధ్యవారు, అగ్రికల్చర్ సెక్టార్ పథకాలకు 21-60 సం.ల వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 17-24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ వద్ద సోమవారం రాత్రి హనుమకొండ నుంచి వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గమనించిన డ్రైవర్, కండక్టర్లు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను మరో బస్సులో సూర్యాపేటకు సురక్షితంగా తరలించారు.
WNP: కొత్త ఉగాది నామ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు తీసుకురావాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో సాహితి కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్, నారాయణ రెడ్డి, వీరయ్య, కాజానో దిన్, సాహితీవేత్తలు పాల్గొన్నారు.
NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు రోజా పాటు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సోమవారం రాత్రి తెలిపింది. గంటకు 8 మ్తెళ్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ADB: గంజాయి రహిత జిల్లా ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బోథ్ CI గురుస్వామి పిలుపునిచ్చారు. జొన్న పంటలో అంతర పంటగా గంజాయి మొక్కలను పెంచుతున్న చింతల్ బోరి, ధర్మపురి గ్రామానికి చెందిన ముకుందరావు, మారుతి అనే నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వ్యసనాల బారిన పడకుండా ఉండాలని CI తెలిపారు.
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం నుంచి నేరుగా ధర్మోజిగూడెం హైవే వరకు ఉన్న లింక్ రోడ్డును బైపాస్ రోడ్డుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికు 5వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్ వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్‌లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ADB: జిల్లాలో ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా రోడ్ల పక్కన, పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం (ఓపెన్ డ్రింకింగ్)పై కఠిన చర్యలు తీసుకుంటామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
JGL: ధర్మపురి మండలం రాయపట్నంలో గంజాయి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయపట్నానికి చెందిన విష్ణు అనే వ్యక్తి గంజాయి కొనుగోలు కోసం లక్షెట్టిపేటకు చెందిన ప్రదీప్‌ను సంప్రదించాడు. ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. నిందితుల నుంచి 100 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
PDPL: రంజాన్ పర్వదినం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి పట్టణంలోని పలు మసీదులను సోమవారం రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. జగ్నేకీ రాత్ సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించుకునే విధంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. మసీదు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలన్నారు.