జగిత్యాల జిల్లాలో పండే ప్రధాన పంటల్లో ఒకటైన పసుపు పంట రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓట్ల ఏటీఎం గానే పనిచేస్తుంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన నాయకుల హామీలు నీటి మూటలుగానే నిలుస్తున్నాయి. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతుండగా, ప్రస్తుతం క్వింటాల్ పసుపు రూ. 9వేల-రూ.14వేల వరకు మాత్రమే ధర పలుకుతుంది.
మహబూబ్నగర్ రూరల్ ధర్మాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిఎల్వి శివన్న పంతులు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు, డ్రగ్స్, రోడ్డు భద్రత, విద్య, సైబర్ నేరాలు, వరకట్నం, బాల కార్మికులు, తదితర చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవా అధికార సంస్థ అండగా ఉంటుందన్నారు.
KMM: ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ANMల కొరత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా PHC పరిధిలో 5 ANM పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా గ్రామాల్లో వైద్య సేవలు సరిగా అందడం లేదని చెప్పారు. ఏఎన్ఎంల కొరత కారణంగా అదనపు బాధ్యతలతో సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలన్నారు.
HYDలో సిల్ట్ ఛాంబర్లు లేకుండా వేల సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ జలమండలి కఠిన చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. హోటల్ రెస్టారెంట్ల నుంచి భారీగా కూరగాయల వ్యర్ధాలు వచ్చి డ్రైనేజీలో కలుస్తుండడంతో బ్లాక్ కేజీ జరిగి మ్యాన్ హోల్స్ నుంచి పొంగి పొర్లుతుంది. దీంతో సిల్ట్ ఛాంబర్ తప్పనిసరి చేశారు.
NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, SBI బ్యాంకులు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలన్నారు.
NLG: కాకతీయ కాలం నుంచి ప్రసిద్ధి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర రానే వచ్చింది. రాష్ట్రంలోనే నాలుగో జాతరగా గుర్తింపు పొందిన జాతరగా నిలిచింది. రేపటి నుంచి జాతర అట్టహాసంగా ప్రారంభం కానుంది. గణపతి పూజతో ప్రారంభమై నాలుగు రోజులపాటు జాతర జరగనుంది. ఈ జాతర పురాతన కాలం నుంచి క్రీడలకు మారుపేరుగా నిలిచింది.
SRPT: అనంతగిరిలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సైన్స్ మేళాలో విద్యార్థులు 25కు పైగా ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు. “వికసిత భారత్‌కు మహిళా శాస్త్రవేత్తలు ఉత్ప్రేరకాలు” అన్న థీమ్‌తో ఈ సైన్స్ మేళా నిర్వహించినట్లు HM సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సైదులు, నాంచారయ్య, బాబు, ఓంకారం, CRP హైమవతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
BDK: దమ్మపేట మండలం గండుగలపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శనివారం లబ్ధిదారులకు అందజేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక భారం తగ్గిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SDPT: చేర్యాల మున్సిపల్ పాలకవర్గ పదవీ బాధ్యతల స్వీకరణలో అధికారులు ప్రోటోకాల్ విస్మరించడం చర్చనీయాంశమైంది. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఫ్లెక్సీని మార్చారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈ-నామ్ 2.0 అప్డేట్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తి క్రయవిక్రయాలు జాప్యమయ్యాయి. 3 రోజులుగా పోర్టల్ పని చేయకపోవడంతో శుక్రవారం మొక్కజొన్న, కందులు, నువ్వులు, వేరుశనగలను బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. సమస్యలు త్వరలో పరిష్కరించి రెండు, మూడు రోజుల్లో సేవలు పునరుద్ధరిస్తామని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.
KMR: మద్నూర్ స్థానిక మార్కెట్లో శనివారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం అమ్మకానికి పరిగె పత్తి మాత్రమే వస్తోందని, మరో ఇరవై రోజుల్లో వ్యాపారం పూర్తిగా ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఖరీఫ్‌లో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గిందని దీంతో రెండు నెలల ముందే మార్కెట్ ముగింపు దశకు చేరుకుందన్నారు.
NLG: చింతపల్లి మండలం గోడుకొండ్ల అలివేలు మంగ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఊరె లక్ష్మణ్ ఎమ్మెల్యేను సన్మానించి జాతరకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భవాని పవన్ కుమార్, గోవర్ధన్, మాస భాస్కర్, మద్దెల కృష్ణ, రాజేష్, పాల్గొన్నారు.
NZB: జిల్లాలోని 5వ డివిజన్ కార్పొరేటర్ నరేష్ శనివారం ‘బస్తీ బాట’ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ చెత్త సేకరణ వాహనం మరమ్మతుకు గురైందని, కావున ప్రజలు కొన్ని రోజుల పాటు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయవద్దని విజ్ఞప్తి చేశారు.
WGL: గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. ప్రధాన రహదారి నుంచి ఆలయానికి చేరుకునే మార్గాలు, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, వాహనాల పార్కింగ్ స్థలాలను ఇందులో స్పష్టంగా పొందుపరిచారు. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు అని నిర్వాహకులు తెలిపారు.
WGL: జిల్లాలో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ లక్ష్యాల రూపకల్పనకు ‘స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పరీక్షల సమయంలో 10వ తరగతి విద్యార్థుల్లో భయాందోళనలు తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.