VSP: పేదల గృహ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 3-4 నెలలు నిర్మాణాలకు అనుకూల కాలమని, ఈలోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే అధికారులకు నోటీసులు జారీ చేయాలన్నారు.
ADB: జిల్లా ఓసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా డాక్టర్ ప్రఫుల్ వజే, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కౌటిక్ రాజేశ్వర్ ఎన్నికయ్యారు. బుధవారం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ కొత్త కమిటీని ప్రకటించి, సభ్యులను ఘనంగా సన్మానించారు. ఓసీ వర్గాల ఐక్యతే లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
WNP: నూతనంగా ఎన్నికైన వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ మాధవి రమేష్ జిల్లా ఎస్పీ సునీత రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మున్సిపల్ ఛైర్మన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
కృష్ణా: గుడివాడ టిట్కో కాలనీకి మల్లేశ్వరరావు కుమారుడు అందే నాగ సతీష్ కుమార్ గత 3 నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఏలూరులో చికిత్స పొందుతున్నాడు. తలనొప్పి ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో సతీష్ అపార్ట్మెంట్‌పై అంతస్తు నుంచి కిందకు దూకాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బుధవారం వైద్యులు నిర్ధారించారు.
MNCL: 10వ తరగతి వార్షిక పరీక్షల కార్యాచరణ ఖరారైందని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇందు కోసం జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండలం అంతిరెడ్డి గూడ గ్రామంలో అచిని సత్తయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఏలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ ఛైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
AP: అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినవన్నీ అసత్యాలేనని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. గతంలో తిరుమలపై వైఎస్ తెచ్చిన జీవోలను రద్దు చేస్తామని అన్నది చంద్రబాబేనని గుర్తు చేశారు. వైవీ సుబ్బారెడ్డి భార్యపై మతపరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని హితువు పలికారు. వైవీ సతీమణి సనాతన హిందూ స్త్రీ అని ఆమె స్పష్టం చేశారు.
KDP: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు మనసుపెట్టి పని చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 22A, మ్యూటేషన్, వెబ్‌ల్యాండ్ కరెక్షన్స్ తదితర అంశాలపై మండలాల వారీగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ బుధవారం సాయంత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి గరిష్ట వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
TG: ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని MLC మల్క కొమురయ్య తెలిపారు. PRC అమలు చేసిన తర్వాతనే ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ స్వీకరించాలని కోరారు. DSC 2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఈ విధానం అమలులో ఉద్యోగులకు ఉన్న సందేహాలను ప్రభుత్వం నివృతి చేయాలన్నారు.
ATP: అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం నిర్వహించిన త్రో బాల్ మ్యాచ్‌లో MLA పరిటాల సునీత జట్టు విజయం సాధించింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి జట్టుతో జరిగిన ఈ పోటీలో సునీత జట్టు ప్రతిభ చాటి గెలుపొందింది. వృత్తిపరమైన పనులతో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఈ క్రీడలు ఉత్సాహాన్నిచ్చాయని ఎమ్మెల్యే సునీత పేర్కొన్నారు.
NDL: యఫ్‌లతో తంటాలు పడుతూ చంటి పిల్లలు, గర్భిణులకు సేవలు అందిస్తున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని CITU పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ అన్నారు. నేడు నంది కొట్కూరు ICDS కార్యాలయం వద్ద సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ.. అంగన్వాడీలు 3వ రోజు దీక్షలు చేపట్టారు. 2024లో 42 రోజులు సమ్మె చేసిన YCP ప్రభుత్వం, ప్రస్తుత కూటమి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష గురువారం మంత్రి అచ్చెన్నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వజ్రపుకొత్తూరు మండలం, మంచినీళ్ళపేట గ్రామంలో మత్స్యకారుల కోసం మినీ జెట్టి నిర్మాణం కోసం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
CTR: మేత కోసం వెళ్ళి ప్రమాదవశాత్తు 15 అడుగుల నీటి సంపులో పాడి ఆవు పడిపోయిన ఘటన పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం సమీపాన బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రజల సహకారంతో తాళ్లు నిచ్చెనలను ఉపయోగించి సంపులో నుంచి సురక్షితంగా అవును బయటికి తీశారు.
కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆలూరు మండలంలో ఏర్పాటు చేసిన శనగ మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. శనగ పంటను క్వింటాకు రూ. 5,875 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు.