WGL: జిల్లా కోర్టుల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 2024 FEB గణాంకాల ప్రకారం మొత్తం 21,672 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2025 FEB నెలలో 175 CVL, 273 క్రిమినల్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇప్పటివరకు 250 సివిల్, 118 క్రిమినల్ కేసులను మాత్రమే పరిష్కరించగలిగారు. కేసుల భారం వల్ల న్యాయ ప్రక్రియ ఆలస్యమవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఏలూరు డీఎల్‌పీవో అమ్మాజీ అన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలంలో ఉంగుటూరు, చేబ్రోలు గ్రామాలలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను డీఎల్‌పీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబు, ఉంగుటూరు పంచాయతీ అభివృద్ధి అధికారి బొడ్డు రవి పాల్గొన్నారు.
NDL: మహిళల అభ్యున్నతితోనే సమాజాభివృద్ధి సాధ్యమని గ్రంథాలయ జిల్లా సెక్రటరీ ప్రకాష్, గ్రంథాలయ అధికారి సుజాత అన్నారు. సిరివెళ్ల గ్రంథాలయ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల అభివృద్ధిలో విద్య కీలకమని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
VKB: మర్పల్లిలోని రైల్వే గేటు వద్ద వాహనదారులు భారీ ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం విద్యార్థులు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలో గేటు పడడంతో తీవ్ర ఆలస్యం అవుతోంది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. నిత్యం ఈ సమస్యతో బాధపడే ప్రజలు బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
SRPT: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ మోతే మండలం బుర్కచర్లలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సీపీఎం గ్రామ కార్యదర్శి కొండ భాస్కర్ మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యవసర ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై గ్యాస్ ధరల పెంపు పెనుభారంగా మారిందని మండిపడ్డారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని మల్లంపల్లి KGBV పాఠశాలలో ఆదివారం NRI అనిల్ కుర్మాచలం పుట్టినరోజు సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ABSF ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ.. విద్యార్థులు రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు.
KNR: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ అలుగునూరులో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. రోడ్లపై ఉన్న చెత్తను తొలగించిన అనంతరం అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్లే మట్టి రోడ్డు నిర్మాణానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు.
W.G: భీమవరం విష్ణు కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరిపారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో మహిళలు పాత్ర చాలా కీలకం అన్నారు. పురుషుల పాటు అన్నిరంగాల్లో మహిళలు సమానంగా రాణిస్తున్నారని కొనియాడారు.
ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 2026-27 సంవత్సరానికి గాను తైబజార్, పశువుల వధశాల ఫీజు వసూలు హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ వేలం ఈనెల 13న మున్సిపల్ కార్యాలయంలో చేపట్టనున్నారు. ఈ వేలంలో పాల్గొనే వారు తమ ఆస్తి పన్ను, నీటి పన్నును మార్చి 31, 2026 వరకు చెల్లించి ఉండాలని అధికారులు తెలిపారు.
JGL: బీర్పూర్ మండలంలోని గోదావరి పుష్కర ఘాట్లను జగిత్యాల రూరల్ సీఐ దామెర సుధాకర్ పరిశీలించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ నుంచి చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్, ఔట్‌పోస్ట్, చెక్‌పోస్ట్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, సిబ్బందికి అవసరమైన సౌకర్యాల కోసం స్థలాన్ని పరిశీలించారు.
MBNR: బాలానగర్ మండలం బిల్డింగ్ తండా పంచాయతీ పరిధిలోని బాబాజీ తండా అంగన్వాడీ కేంద్రంలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కోడిగుడ్లు ఉడికించే పాత్రలో పడింది. ఈ ఘటనలో చిన్నారి వీపు కింది భాగం తీవ్రంగా గాయపడింది. శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా చిన్నారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
KMR: మొక్కజొన్న రైతుల బకాయిలు 2025- 26 సీజన్‌కు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మార్క్ ఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్ R. శశిధర్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి రూ. 63.19 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు.
NLG: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్కెట్‌పల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జేరిపోతుల భరత్ కుమార్ మహిళా సిబ్బందిని గౌరవించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కొనియాడుతూ, పంచాయతీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి ఆయన స్వయంగా చీరలను పంపిణీ చేశారు. వారి నిరంతర కృషికి గుర్తింపుగా ఈ చిరుకానుక అందజేసినట్లు తెలిపారు.
HNK: మడికొండ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మిని, CI కిషన్ సిబ్బందితో కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం కల్పించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
W.G: ఆచంటకు చెందిన YCP నాయకులు ఆదివారం కోనసీమ జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మాక్వానాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆచంట నియోజకవర్గంలోని దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీతారాం, వెంకటేశ్వరరావు, దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.