NGKL: తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ వద్ద వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొన్న ప్రమాదంలో దాసర్ల తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ASF: IPL బెట్టింగ్, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తిర్యాణి SI వెంకటేష్ సూచించారు. బెట్టింగ్ జోలికి పోయి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలన్నారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠ పోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లకు ఇది ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ కావడంతో, గెలుపుతో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ధోనీ, డెవాల్డ్ బ్రెవిస్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్న చెన్నై.. రాజస్థాన్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
NLG: సాగునీరు అందక రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిగా మారనుందని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం చండూరులో సాగునీటి ప్రాజెక్టు మీద ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు.
MBNR: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన Telangana Legislators Sports Meet-2026 తొలి ఎడిషన్ రెండో రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యేల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి వ్యవహరించారు. తన జట్టును విజయపథంలో నడిపించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ప్రథమ బహుమతిని అందుకున్నారు.
PDPL: రామగుండం ఎన్టీపీసీ జ్యోతి నగర్లో దీప్తి మహిళా సమితి 44వ వార్షికోత్సవ వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. NTPC EDచందన్ కుమార్ సమంత, రేఖ సమంత వేడుకలను ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, దేశభక్తి గీతాలు అలరించాయి. సమితి చేస్తున్న సామాజిక సేవలను ఈడీ అభినందించారు. వివిధ రాష్ట్రాల సంస్కృతిని చాటేలా ప్రదర్శనలు నిర్వహించారు.
JN: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ABV డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. 18 నుంచి 33 సంవత్సరాల మధ్య, వయసున్న అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు జీరాక్స్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
TG: మాజీ MLA పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో పేరు బయటకు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. గోవాలో డీజేగా పనిచేసే క్లింటన్ పాత్రను గుర్తించారు. ఇటీవల అరెస్టయిన జూబ్లీహిల్స్‌కు చెందిన వైద్యుడు కోలా బాలాజీ పటేల్‌కు.. క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు.
సినిమాల్లో నటిస్తాను కానీ, సినిమాలు పెద్దగా చూడనని ఆమీర్ ఖాన్ వెల్లడించాడు. తమది చాలా క్రమశిక్షణ కలిగిన కుటుంబం కావడంతో తన తల్లిదండ్రులు తనను సినిమాలు చూడనిచ్చేవారు కాదని తెలిపాడు. కేవలం దూరదర్శన్‌లో వచ్చే పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను మాత్రమే చూడనిచ్చేవారని అన్నాడు. ఆమీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
E.G: మిల్లర్లు, దళారుల కుమ్మక్కుతో సన్న బియ్యం పండించిన రైతులు దివాళా తీస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రిలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలు ప్రేక్షక పాత్ర పోషించడంతో మిల్లర్ల దోపిడీకి రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరించకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారన్నారు.
VZM: వాహనదారులు నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారణకు సహకరించాలని బొబ్బిలి SI రమేశ్ సూచించారు. ఆదివారం సాయంత్రం స్దానిక పాత డంపింగ్ యార్డు వద్ద వాహన తనిఖీ చేపట్టి పాత చలానాలను కట్టించారు. ఆయన మాట్లాడుతూ.. వాహన నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించాలని వాహనదారులను కోరారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో తరలివచ్చి శ్రీమల్లికార్జున స్వామి సమేత అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో గ్రామపెద్దలు, కుల సంఘాల వారు పాల్గొన్నారు.
ATP: పావని ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ గుత్తా రవీంద్ర తండ్రి, మాజీ సర్పంచ్ గుత్తా నరసయ్య మృతి పట్ల అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాయనవారిపల్లె గ్రామంలో రవీంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
SRPT: సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్లో నేడు ఉదయం 11 గంటలకు మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2025-26 సవరణ, 2026-27 ముసాయిదా బడ్జెట్ ఈ సందర్భంగా ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సాధారణ సమావేశం ప్రారంభమవుతుందని చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత, మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి తెలిపారు.
PLD: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.