TG: మాజీ MLA పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో పేరు బయటకు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. గోవాలో డీజేగా పనిచేసే క్లింటన్ పాత్రను గుర్తించారు. ఇటీవల అరెస్టయిన జూబ్లీహిల్స్‌కు చెందిన వైద్యుడు కోలా బాలాజీ పటేల్‌కు.. క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు.
సినిమాల్లో నటిస్తాను కానీ, సినిమాలు పెద్దగా చూడనని ఆమీర్ ఖాన్ వెల్లడించాడు. తమది చాలా క్రమశిక్షణ కలిగిన కుటుంబం కావడంతో తన తల్లిదండ్రులు తనను సినిమాలు చూడనిచ్చేవారు కాదని తెలిపాడు. కేవలం దూరదర్శన్‌లో వచ్చే పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను మాత్రమే చూడనిచ్చేవారని అన్నాడు. ఆమీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
E.G: మిల్లర్లు, దళారుల కుమ్మక్కుతో సన్న బియ్యం పండించిన రైతులు దివాళా తీస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రిలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలు ప్రేక్షక పాత్ర పోషించడంతో మిల్లర్ల దోపిడీకి రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరించకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారన్నారు.
VZM: వాహనదారులు నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారణకు సహకరించాలని బొబ్బిలి SI రమేశ్ సూచించారు. ఆదివారం సాయంత్రం స్దానిక పాత డంపింగ్ యార్డు వద్ద వాహన తనిఖీ చేపట్టి పాత చలానాలను కట్టించారు. ఆయన మాట్లాడుతూ.. వాహన నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించాలని వాహనదారులను కోరారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో తరలివచ్చి శ్రీమల్లికార్జున స్వామి సమేత అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో గ్రామపెద్దలు, కుల సంఘాల వారు పాల్గొన్నారు.
ATP: పావని ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ గుత్తా రవీంద్ర తండ్రి, మాజీ సర్పంచ్ గుత్తా నరసయ్య మృతి పట్ల అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాయనవారిపల్లె గ్రామంలో రవీంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
SRPT: సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్లో నేడు ఉదయం 11 గంటలకు మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2025-26 సవరణ, 2026-27 ముసాయిదా బడ్జెట్ ఈ సందర్భంగా ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సాధారణ సమావేశం ప్రారంభమవుతుందని చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత, మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి తెలిపారు.
PLD: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
NLR: లింగసముద్రంలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పంటను రక్షించేందుకు రైతు పొలానికి అక్రమంగా విద్యుత్ కంచె ఏర్పాటుతో, ఆ మార్గంలో వెళ్లిన గేదె విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా కరెంట్ ఏర్పాటు చేసిన రైతుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
VSP: కంచరపాలెం- కప్పరాడ నేషనల్ హైవే సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ జరిగిన సీతారాముల అనుపోత్సవంలో చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నీరాజనాలు పలికారు.
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు RCM చర్చిలో మ్రాని కొమ్మల ఆదివారాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తేలప్రోలు గ్రామపురి వీధుల్లో ఫాదర్ గోళ్ల విజయ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు మట్టలు పట్టుకుని యేసు క్రీస్తు కీర్తనలు పాడుతూ ప్రదక్షిణగా చర్చిలోకి ప్రవేశించారు. అనంతరం ఫాదర్ విజయ కుమార్ యేసుప్రభు పడిన శ్రమలను విశ్వాసులకు వివరించారు.
RR: హయత్‌నగర్ Tనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ MP మధుయాష్కీ గౌడ్ 23 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.17.20 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ఈ నిధి ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
RR: ఎల్బీనగర్‌లో TG ఉద్యమకారుల ఫోరం నిర్వహించిన పత్రికా సమావేశంలో నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్ తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ మేనిఫెస్టో హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు.
AKP: మునగపాక మండలం టి.సిరసపల్లిలో నిర్మించిన బాక్స్ క్రికెట్ స్టేడియంను టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఆదివారం ప్రారంభించారు. యువత క్రీడాల పట్ల ఆసక్తి చూపించాలన్నారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బాక్స్ క్రికెట్ స్టేడియం ప్రతినిధి గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
HNK: మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇవాళ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజల నుంచి గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి వేదికగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.