SRD: విద్యుత్ ప్రమాదంలో ఓ రైతు మృతి చెందిన సంఘటన కంగ్టి మండలం చాప్ట బి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బాలాజీ రావు పాటిల్ గురువారం ఉదయం తన పొలానికి వెళ్లగా, అక్కడ చేనుకు ఉన్న కంచెకు కరెంటు షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. ఈయన మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద గల రజకుల రేవులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో AP 16 AU 9250 నంబర్ గల బజాజ్ ప్లాటినా బైక్ లభించింది. దానిపై పి.వేంకటేశ్వర రావు అని ఉందని స్థానికులు తెలిపారు.
JN: జనగామ జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి, రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్లో మద్యపాన నిషేధ తీర్మానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా, తాగిన వారిని, అమ్మిన వారిని పట్టిస్తే రూ.10 వేలు నజరానా ఇస్తారు.
AP: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పతనం ప్రారంభమైందని అన్నారు. ‘కులాలను రెచ్చగొట్టింది మీరా?.. మేమా? అని ప్రశ్నించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధిద్దాం అని అనుకుంటున్నారు. శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారన్న భ్రమ నుంచి బయటకి రావాలి’ అని పేర్కొన్నారు.
KMM: కారేపల్లి మండలంలోని గేట్ రేలకాయలపల్లిలో హోలీ వేడుకల వేళ విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ కేలోత్ మంగ భర్త బన్సీపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వేడినీళ్లు పోసి దాడికి పాల్పడ్డారు.హోలీ ఆడుదామని పిలిచి ఈ అమానుషానికి ఒడిగట్టారు. గాయపడిన బన్సీని స్థానికులు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్స్ తెలిపారు.
ATP: సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు గురువారం కలిశారు. జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను నేరుగా CM దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కూటమి నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో 20 ఏళ్లు సుపరిపాలన అందించాలని కోరుకున్నట్లు తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు గురువారం 11 గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్స్‌యాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. www.bse.ap.gov.in, స్కూల్ ఎడ్యుకేషన్ యాప్, LEAP నుంచి సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
VZM: మెరకముడిదాం గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గౌస్య బేగం తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇవాళ వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
NGKL: పేద ప్రజల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని నడింపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
W.G: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈ నెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
కర్నూలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ ఛాంబర్ సమీపంలో కొందరు అధికారులు విందులు చేసి, ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేశారు. ప్రతీ శనివారం పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించే కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఇలా చేయడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. పది మందికి మంచి చెప్పాల్సిన అధికారులే నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
MDK: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకం అమలులో జాప్యం జరుగుతుండటంతో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదారు నెలలుగా ఎఫ్‌సీఐ (FCI) గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా సకాలంలో కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖున అందాల్సిన బియ్యం, 7వ తారీఖు దాటినా అందడంలేదన్నారు.
బిర్యానీ ఆకు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మధుమేహ బాధితుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బిర్యానీ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది.
MNCL: ఎఫ్ఎల్ఎస్ పరీక్షను విద్యార్థులు బాగా రాయాలని లక్షెట్టిపేట మండల ఎంఈఓ శైలజ సూచించారు. గురువారం లక్షెట్టిపేట్ మండలంలోని ఉత్కూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలించి ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చిలో నిర్వహించే ఎఫ్ఎల్ఏస్ ఎగ్జామ్‌కు విద్యార్థులను సంసిద్ధులను చేయాలని ఉపాధ్యాయులను ఆమె ఆదేశించారు.