దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు NEET(UG)-2026కు సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కలలు కనే డాక్టర్ వృత్తికి ఈ పరీక్షే తొలి మెట్టు. అయితే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా.. పరీక్షకు ముందు రోజు కనీసం 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర తీసుకోండి. తేలికపాటి ఆహారం తినండి. కాగా, మే 3న పరీక్ష జరగనుంది.
AP: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీ పొడిగించారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 27 చివరి తేదీ కాగా.. గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏప్రిల్ 30 తర్వాత గడువు తేదీ పొడిగించబోమని స్పష్టం చేశారు.
TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2026 ఒకటో విడత)కు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. 27వ తేదీ వరకు 85,426 మంది దరఖాస్తు చేశారు. పేపర్-1కు 19,933, పేపర్-2కు 54,059 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ గాజర్ల రమేష్ వెల్లడించారు. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సూచించారు.
విండోస్ 11 అప్‌డేట్ కష్టాలకు మైక్రోసాఫ్ట్ చెక్ పెట్టింది. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అప్‌డేట్‌కు సంబంధించి కీలక మార్పులు చేసింది. గతంలో అప్‌డేట్‌లను గరిష్ఠంగా 35 రోజుల వరకు మాత్రమే ఆపడానికి అవకాశం ఉండేది. ఇకపై ప్రతి 35 రోజులకోసారి పొడిగించుకుంటూ మీకు నచ్చినన్ని రోజులు అప్‌డేట్‌ను వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన క్లియర్ ట్రిప్.. ట్రైన్ టికెట్ బుకింగ్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు IRCTCతో జత కట్టింది. క్లియర్ ట్రిప్ యూజర్లు సాధారణ, తత్కాల్ కోటా టికెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో రియల్‌టైమ్ సీట్ అందుబాటు, ఫేర్ వివరాలు, PNR స్టేటస్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్స్ వంటి సేవలు లభిస్తాయని తెలిపింది.
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో తక్కువ ధర ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. రూ.50 లక్షల లోపు ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 23 శాతం క్షీణించాయి. కొత్త ఇళ్ల నిర్మాణం తగ్గడమే దీనికి ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి. సామాన్యులు కొనే ఇళ్ల సంఖ్య తగ్గిపోవడంతో, మొత్తం 16,273 ఇళ్లు మాత్రమే అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది.
RBI పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడంతో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు ఇవాళ ట్రేడింగ్ లో 8 శాతం కుప్పకూలాయి. NSEలో రూ.1,051.10 కనిష్టానికి చేరినప్పటికీ, తర్వాత పుంజుకుని 1 శాతం నష్టానికి పరిమితమయ్యాయి. ఈ నిర్ణయం తమ ఆర్ధిక స్థితిపై ప్రభావం చూపబోదని కంపెనీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం షేరు రూ.1,127 వద్ద కొనసాగుతోంది.
NEET అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు neet.nta.nic.in లేదా exams.nta.ac.in/NEET ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా MAY 3న మ.2 నుంచి సా.5 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 పెరిగి రూ.1,54,420కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.350 పెరిగి రూ.1,41,550గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,70,000గా ఉంది.
అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సంస్థ ఆర్గానన్ అండ్ కోను కొనుగోలు చేయనున్నట్లు సన్ ఫార్మా ప్రకటించింది. ఒక్కో షేరుకు 14 డాలర్ల చొప్పున పూర్తిగా నగదు రూపంలో కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ కొనుగోలు ఒప్పందం విలువ 11.75 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు)గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం ప్రపంచంలోని టాప్ 25 ఫార్మా కంపెనీల్లో ఒకటిగా సన్‌ఫార్మా నిలవనుంది.
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు NTA శుభవార్త చెప్పింది. ఉ.10 గంటలకు NEET పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అడ్మిట్ కార్డులు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు 180 నిమిషాల్లో 180 ప్రశ్నలకు జవాబులు రాయాలి.
TG: జపాన్, జర్మనీలో కేర్ టేకర్, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాల్లో రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ(నిథమ్) ఆధ్వర్యంలో ఆయా దేశాల భాషలపై ఒక్కో బ్యాచులో 200 మందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగాలు ఇచ్చేలా, అభ్యర్థుల ఎంపికకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ ఆయిల్ ధర 2 శాతానికి పైగా పెరిగి బ్యారెల్ రేట్ 107.48 డాలర్లకు చేరింది. హర్మూజ్ నుంచి నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. యూఎస్ క్రూడాయిల్ కూడా 2 శాతం పెరిగి బ్యారెల్ ధర 96.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ పెరుగుదల రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపనుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 సంవత్సరానికి సంబంధించి మూడు భారీ నోటిఫికేషన్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీగా ఉన్న 3,734 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, లేదా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత గల అభ్యర్థులు వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో రూ.7,071 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ.7,118 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా 0.64% తగ్గింది. నికర వడ్డీ ఆదాయం సుమారు 5% పెరిగి రూ.14,457 కోట్లకు చేరింది. ఒక్కో షేరుపై రూ.1 డివిడెండు ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది.