అన్నమయ్య: గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా శుక్రవారం నందలూరులో పర్యటించారు. రైల్వే గేట్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ పనులు నాసిరకంగా ఉన్నాయని, నీటి లీకేజీ, గుంతల సమస్యలను రాచూరి మురళి తెలియజేశారు. దీనిపై స్పందించిన డీఆర్‌ఎం త్వరలో మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు.
NLR: రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో హైవే అధికారులు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం బ్రీత్ అనలైజర్ పరికరాన్ని అందజేసి తమ బాధ్యతను చాటుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని గుర్తించేందుకు పరికరం ఉపయోగపడుతుందని ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. దీని ద్వారా రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయవచ్చన్నారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రసూల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త లైన్లు పనులు జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని ఎర్రచేలు, విరువూరు రోడ్డు, కరెంటు ఆఫీసు కాలనీ, పాత స్టేట్ బ్యాంకు రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
ATP: అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. జిల్లా ఎస్పీ పి.జగదీష్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామి వార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా సీతారాముల కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా సాగింది.
KKD: జిల్లాలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని , సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని శుక్రవారం JC అపూర్వ భరత్ స్పష్టం చేశారు . కాకినాడ కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు . సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 8886903611కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
VZM: కొత్తవలస కుమ్మరి వీధిలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం కన్నులపండుగగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకను పట్టణ భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ATP: శ్రీరామనవమి సందర్భంగా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను గజవాహనంపై కొలువు తీర్చి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ఈఓ విజయరాజు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
VSP: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి సభను ఈ నెల 29న అల్లిపురం సీపీఐ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు నాస్తిక సమాజం నేతలు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జరిగే సభలో పలువురు వక్తలు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సమావేశంలో గోడపత్రికలు ఆవిష్కరించారు. ప్రజలు, ప్రగతిశీల వాదులు పెద్దఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
VZM: ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ ఆదివాసీలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర తెలిపారు. విజయనగరంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన గిరిజన నాయకులను ఎమ్మెల్యే అవమానించారని ఆరోపించారు. అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.
SKLM: రణస్థలం పంచాయితీ బండిపాలెం గ్రామంలో మంచినీటి సమస్యకు పరిష్కారం లభించింది. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీ నాయుడు శుక్రవారం ఇక్కడ కొత్త మంచినీటి బోర్ మోటరును ప్రారంభించారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
KRNL: మతం మారినంత మాత్రాన అంటరానితనం పోతుందంటే అది బ్రమ మాత్రమేనని డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి మహేష్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం దళిత హక్కుల పోరాట డీహెచ్‌పీఎస్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్సీ జాబితాలో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
KKD: జిల్లా పోలీస్ గ్రౌండ్స్ ఆవరణలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ దంపతులు పాల్గొని, శాస్త్రోక్తంగా నిర్వహించిన కల్యాణ క్రతువులో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శ్రీ రామనాస్మరణతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజబాబును ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శుక్రవారం కలిశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాడు. తన పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో ఉన్న భూ సమస్యలను ఆయన ప్రస్తావించారు. కలెక్టర్ స్పందిస్తూ తప్పకుండా తాను సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తాననిహామీ ఇచ్చారు.
NLR: ప్రముఖ సిని కధానాయకుడు కొణిదెల రాంచరణ్ జన్మదినం సందర్బంగా రాముడుపాలెం, చాకిచర్ల గ్రామాలకు చెందిన 16 మంది అభిమానులు శుక్రవారం కె. దేవకిరణ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రక్త కేంద్రంకు వచ్చి రక్త దానం చేశారు. ఈ సందర్బంగా “పెద్ది” సినిమా షూటింగ్ లో గాయపడిన రాంచరణ్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు తదిరులు పాల్గొన్నారు.
TPT: రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామంలోని నూతన ఆలయాల కుంభాభిషేక మహోత్సవంలో చెవిరెడ్డి కుటుంబీకులు పాల్గొన్నారు. చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి శ్రీకోదండరామునికి సమర్పించారు. ఆలయానికి చేరుకున్న వారికి గ్రామస్తులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.