బడ్జెట్ సమావేశాలకు సమయం సమీపిస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఈ ఏడాది (2023) ప్రవేశపెట్టేది పూర్తిస్థాయి బడ్జెట్. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తమపై కరుణ చూపిస్తుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కిల్లీ కొట్టు నుంచి స్టాక్ మార్కెట్ దాకా కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటాయి. అయితే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల నుంచి సాధారణ ప్రజలకు పెద్దగా మేలు చేసే నిర్ణయాలేమీ తీసుకోలేదు. కేంద్ర బడ్జెట్ నుంచి ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనాలు దక్కలేదు. ఈసారైనా తమకు మేలు జరుగుతుందనే ఆశలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు.
అయితే కేంద్ర బడ్జెట్ నుంచి మాత్రం ప్రజలు ఐదు ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ఐదు విషయాల్లో తమకు కేంద్రం నుంచి తీపి కబురు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ పంచ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
1. ఆదాయ పన్ను రాయితీ: సామాన్య, మధ్యతరగతి, ఉద్యోగులకు పెద్ద ఆశ ఏమైనా ఉంటే అది పన్ను రాయితే. పన్ను శాతం తగ్గించాలని పెద్ద ఎత్తున ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే గత రెండు, మూడు బడ్జెట్ లలో పన్ను రాయితీపై పెద్దగా నిర్ణయం తీసుకోలేదు. ఈసారి ఎంతో కొంత ఊరట లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.
2. ఉత్పాదకతకు ఊతం: భారతదేశం కుటీర పరిశ్రమ, వస్తు ఉత్పత్తులకు కేంద్రంగా ఉంది. అయితే తయారీ రంగానికి పెద్దగా ప్రయోజనాలు దక్కలేదు. మేకిన్ ఇండియా పేరుకు మాత్రమే కానీ వాస్తవంగా స్థానిక వ్యాపారులకు మేలు కలిగే నిర్ణయాలు జరగలేదు. ఈ వర్గం కేంద్ర బడ్జెట్ నుంచి చాలా ఆశిస్తున్నది.
3. గ్రామీణ సంక్షేమానికి పెద్దపీట: మనదేశంలో గ్రామీణ ప్రాంతం అత్యధికంగా ఉంటుంది. గ్రామీణ భారతానికి మేలు కలిగేలా బడ్జెట్ లో కేటాయింపులు జరగాలి. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేలా భారీగా ఆర్థిక ప్రయోజనాలు దక్కాలి. సంక్షేమానికి పెద్దపీట కల్పించాల్సిన అవసరం ఉంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ ఫోకస్ పెట్టాల్సి ఉంది.
4. మౌలిక సదుపాయాలు: భారతేదశంలో ఇంకా మౌలిక సదుపాయాల కొరత వేధిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. ఈ వసతుల కల్పనతోనే వృద్ధి, ఉద్యోగాల కల్పన అనేది పెరుగుతుంది. కేంద్ర బడ్జెట్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ కేటాయింపులు దక్కాల్సి ఉంది.
5. ధరల భారం నుంచి విముక్తి: ప్రస్తుతం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. ధరల భారం నుంచి వెంటనే ప్రజలకు విముక్తి లభించాలి. పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. తక్షణ ఉపశమనంగా ప్రజలకు కొంత ఊరట కలిగించే నిర్ణయం కేంద్ర బడ్జెట్ లో ఉండాలి. తనను తాను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తినని చెప్పుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మరి మధ్య తరగతి కుటుంబాలకు ఏమైనా తాయిలాలు, ప్రయోజనాలు ఇస్తారో లేదో చూడాలి.