»Epfo Extends Deadline To Apply For Higher Pension Till June 26
EPFO: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్..!
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి జూన్ 26, 2023 వరకు తేదీని పొడిగించింది.
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ(EPFO) శుభవార్త తెలియజేసింది. అధిక పెన్షన్ దరఖాస్తు గడువు విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి మే 3 తో గడువు ముగియాల్సి ఉంది. అయితే.. మంగళవారం సమావేశంలో జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమయాన్ని పొడిగించాలని కోరుతూ వివిధ సంఘాల నుంచి వినతుల మేరకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది.
పింఛనుదారులు/సభ్యులు ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులను తగ్గించేందుకు వారికి సులభతరమైన అవకాశాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని.. ఉద్యోగులు, యజమానులు, వారి సంఘాల నుంచి వచ్చిన వివిధ డిమాండ్లను సానుభూతితో పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.
2014కు ముందు సర్వీసులో చేరి, ఆ తరువాత కొనసాగుతూ వాస్తవిక వేతనం (ఈపీఎఫ్వో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకన్నా ఎక్కువ) పై ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాలలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది.
సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం పెన్షనర్లు / సభ్యుల నుంచి ఆప్షన్ / జాయింట్ ఆప్షన్ ధ్రువీకరణ కోసం దరఖాస్తులను పొందేందుకు EPFO ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్ సౌకర్యం 03.05.2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. దానిని పొడగించింది.