వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాశ్ రెడ్డి (kadapa mp, ycp leader avinash reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో (telangana high court) ఈ రోజు విచారణ జరిగింది. సీబీఐ (cbi) తరఫున లాయర్లు తమ వాదనలు వినిపించారు. వివేకా హత్య గురించి అవినాశ్ రెడ్డికి ముందే తెలుసునని, గత నాలుగు విచారణలలో ఆయన తమకు ఏమాత్రం సహకరించలేదని కోర్టుకు తెలిపారు. దర్యాఫ్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను పూర్తిగా సేకరించామని, ఇప్పుడు అవినాశ్ రెడ్డి (avinash reddy) నుండి తాము మరింత సమాచారం సేకరించవలసి ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోరారు. ఈ హత్య జరగడానికి ముందు.. ఆ తర్వాత అవినాశ్ ఇంట్లో సునీల్ యాదవ్, ఉదయ్ ఉన్నారని చెప్పారు. ఈ హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాల్సి ఉందన్నారు.
వివేకా హత్య కేసులో అవినాశ్ పాత్ర ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి సాంకేతిక ఆధారాలు సేకరించామన్నారు. హత్య జరిగిన రోజు సాక్ష్యాల తారుమారు ప్రయత్నాల్లో ఈయన పాత్ర కీలకమన్నారు. హత్య జరిగిన రోజు వెంటనే ఆయన అక్కడకు వచ్చారని చెప్పింది. వివేకా తలకు బ్యాండేజ్ చుట్టి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారని తెలిపింది. ఈ కేసులో రూ.40 కోట్ల డీల్ కూడా కుదిరినట్లు తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు. ఈ నెల 30వ తేదీ లోపు విచారణను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, ఆ మేరకు అవసరమైతే ఆయనను అరెస్ట్ చేస్తామని సీబీఐ స్పష్టం చేసింది. మరోవైపు వైయస్ వివేకా కూతురు సునీత లాయర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న అనంతరం హైకోర్టు విచారణను గం.2.30కు వాయిదా వేసింది. వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పైన నిర్ణయం తీసుకోనున్నారు.