తెలంగాణలో కొత్త పొత్తు పొడుస్తున్నది. అధికార పార్టీని ఢీకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యేట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒక కూటమి.. జట్టుగా తయారు చేయడానికి వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు ఫోన్లు చేసిన షర్మిల తాజాగా తెలంగాణ జన సమితి పార్టీ (Telangana Jana Samithi- TJS Party)అధినేత ప్రొఫెసర్ కోదండ రామ్ (Professor Kodandaram)తో షర్మిల భేటీ కావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కలిసి రావాలని కోరేందుకు కోదండ రామ్ తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాదయాత్రకు న్యాయస్థానం అనుమతి లభించికపోవడంతో షర్మిల ప్రత్యామ్నాయ పోరాటాలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుంటున్నారు. అందులో భాగంగా ‘టీ సేవ్’ అని సరికొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఈ విషయమై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులకు ఫోన్లు చేసి మాట్లాడింది. తాజాగా అలనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండ రామ్ ను కూడా తన పోరాటంలో భాగస్వామ్యం చేయడానికి షర్మిల ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న టీజేఎస్ కార్యాలయానికి చేరుకుని సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం కోదండ రామ్ మాట్లాడుతూ.. ‘నిరుద్యోగ సమస్య తీవ్రమైనదని మేం గుర్తించాం. నిరుద్యోగ సమస్యలపై టీజేఎస్ తరఫున పోరాటం చేస్తున్నాం. షర్మిల చేసిన ప్రతిపాదనను రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తీవ్ర పోరాటం జరుగాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘నిరుద్యోగుల పక్షాన కొట్లాడడమే ప్రస్తుత లక్ష్యం. దీనికి అన్ని పార్టీలు ఏకమవుతేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతంది. టీ సేవ్ ఫోరం అధ్యక్షుడిగా కోదండ రామ్ ను కోరాం’ అని తెలిపారు.
ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కమ్యూనిస్టు పార్టీలను కలవబోతున్నారు. సీపీఐ (CPI) కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో (Kunamneni Sambasiva Rao), మధ్యాహ్నం 2.30 గంటలకు సీపీఐ(ఎం) (CPI-M) కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో (Tammineni Veerabhadram) షర్మిల సమావేశం కానుంది. నిరుద్యోగుల సమస్యలపై పోరాటానికి వారి మద్దతు కూడా కోరనున్నది. కాగా షర్మిల ప్రతిపాదనకు ఇప్పటికే బీజేపీ తిరస్కరించగా.. కాంగ్రెస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె చేస్తున్న ప్రతిపాదన ఫలించేటట్టు కనిపించడం లేదు.