»Ugly Fight Erupts At Baghpat Wedding When Grooms Kin Isnt Served Paneer
Baghpat wedding: పెళ్లి విందులో పన్నీర్ లేదని బెల్టులతో కొట్టుకున్నారు
వివాహ విందులో పన్నీరు లేదని వరుడి బంధువు ఒకరు ఘర్షణకు దిగారు వధువు తరఫువారితో. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్పట్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నది.
సాధారణంగా ఎక్కడైనా పెళ్లి జరిగినప్పుడు భోజనంపై అసంతృప్తి ఏర్పడటం.. వ్యక్తం చేయడం… వాదనలు జరగడం తెలిసిందే. కానీ పెళ్లి భోజనంలో పన్నీరు పెట్టలేదని ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లిన సంఘటన జరిగింది. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్పట్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నది. వివాహ విందులో పన్నీరు లేదని వరుడి బంధువు ఒకరు ఘర్షణకు దిగారు వధువు తరఫువారితో. ఇది తీవ్ర ఘర్షణకు దారి తీసి, ఇరువర్గాలు బెల్టులతో కొట్టుకునే స్థాయికి చేరుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని, పలువురిని అరెస్ట్ చేశారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి, ఆ తర్వాత అందరినీ విడుదల చేశారు.
సమాచారం మేరకు… భోజనం సమయంలో పన్నీరు ఎక్కడ అని ఫుడ్ సర్వ్ చేస్తున్న వారిని అడిగారు. వారు లేదని చెప్పడంతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, తమకు ఇష్టమైన పాటలు వేయడం లేదంటూ డీజే సౌండ్ వారి పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నీర్ విషయమై వధువు తరఫు వారు సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొందరు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ, కొంతమంది ఏమాత్రం ఆగలేదు. ఓ మహిళ ఓ వ్యక్తిని ఆపేందుకు ఎంతో ప్రయత్నం చేసింది. కానీ అతను ఘర్షణలో మీదమీదకు ఉరికాడు. మరో వ్యక్తి కిందపడిపోయాడు. కానీ అతనిని ఓ యువకుడు బెల్టుతో బాదుతూనే ఉన్నాడు. ఓ వ్యక్తి అతనిని ఆపాడు. కిందపడిపోయిన వ్యక్తి కోసం కొంతమంది పరుగు పెడుతున్న దృశ్యం కూడా ఉంది.
అక్కడ జనం గుమికూడి, ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘర్షణలో ప్రధానంగా ముగ్గురు, నలుగురు యువకులు ఉన్నారు. వారిని పోలీసులు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అయితే వరుడు, వధువు.. ఇరువర్గాల నుండి విజ్ఞప్తుల నేపథ్యంలో పోలీసులు వారిని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో చాలామంది మూడేళ్ళ క్రితం అంటే 2020లో ఇదే బాగ్‌పట్‌లో చాట్ వెండర్స్ గొడవను గుర్తు చేసుకుంటున్నారు. ఇది కూడా అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో 1 నిమిషం 12 సెకన్లు ఉన్నది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. వినోదాన్ని అందించడంలో యూపీ ఎప్పుడు ఫెయిల్ కాదని ఒకరు సెటైర్ వేస్తే, ప్రతి వివాహంలో కొద్దో గొప్పో ఇలాంటి వారు ఉంటారని మరొకరు అంటూ స్పందించారు.