»Two Labours Died In Brs Party Mla Guest House In Nizamabad District
MLA Guest House ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో ఇద్దరు కూలీల మృతి
నిమిషాల వ్యవధిలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తోటి కార్మికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంటనే పనులు ఆపేసి వారు పక్కకు వెళ్లిపోయారు. మృతుడు రాజు నిజామాబాద్ లోని వినాయకనగర్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు. ఇంకా పెళ్లి కాలేదు.
భవనం కూల్చివేత పనులకు వెళ్లగా.. అకస్మాత్తుగా గోడ మీద పడి ఓ కూలీ దుర్మరణం పాలవగా.. ఆ సంఘటన చూసి గుండెపోటుతో మరో కార్మికుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నవీపేట (Navipet) మండలం జన్నేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కాగా ఆ పనులు జరుగుతున్న ప్రాంతం బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎమ్మెల్యే అతిథిగృహం (MLA Guest House) కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లోని మల్కాజిగిరి (Malkajigiri) ఎమ్మెల్యే (MLA) మైనంపల్లి హన్మంత్ రావు (Mynampally Hanumanth Rao)కు జన్నేపల్లి గ్రామంలో ఓ అతిథి గృహం ఉంది. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ కావడంతో తరచూ ఇక్కడకు వస్తుంటారు. అయితే నెల రోజులుగా అతిథిగృహం మరమ్మతులు జరుగుతున్నాయి. నిజామాబాద్ కు చెందిన ఓ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పనులు చేస్తున్నారు. ఈ పనులకు నవీపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కొండపల్లి రాజు (28)తో మరో ఐదుగురు కార్మికులు వచ్చారు. రెండో అంతస్తులో గోడ కూలుస్తుండగా ప్రమాదవశాత్తు రాజు జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే అంతస్తులో పని చేస్తున్న మరో కూలీ సాయిలు (29) ఈ ఘటనను కళ్లారా చూశాడు. తట్టుకోలేకపోయాడు. కళ్ల ముందే ఓ వ్యక్తి ప్రమాదం బారినపడి మరణించడంతో తట్టుకోలేక వాంతులు చేసుకున్నాడు. అనంతరం గుండెపోటుకు గురై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తోటి కూలీలు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా అతడు అప్పటికే కన్నుమూశాడు.
నిమిషాల వ్యవధిలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తోటి కార్మికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంటనే పనులు ఆపేసి వారు పక్కకు వెళ్లిపోయారు. మృతుడు రాజు నిజామాబాద్ లోని వినాయకనగర్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు. ఇంకా పెళ్లి కాలేదు. కాగా ఈ సంఘటన విషయమై ఎమ్మెల్యే హన్మంతరావు వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజా రెడ్డి తెలిపాడు.
ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనే డిమాండ్ వ్యక్తమయ్యాయి. అయితే పనుల సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన రెండు ప్రాణాలు గాల్లో కలిశాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనుల వలన తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జన్నేపల్లి (Jannepally) గ్రామస్తులు చెబుతున్నారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.