»Mylavaram Excise Ci Girija Call Record Goes To Viral Against Mining
CI Girija నువ్వేంట్రా చెప్పేది.. ఏం **..తావ్: రెచ్చిపోయిన మైలవరం సీఐ
బాధితుడికి న్యాయం చేయాల్సి ఉండగా ఉల్టా అతడిపైకి తిరగబడ్డారు. బూతులు తిడుతూ.. ఎక్కువ చేస్తే లేని కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. పైగా ఆమె ఓ మహిళ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్ వైరల్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి సేవకులుగా మారారని, తాడేపల్లి నుంచి వచ్చే ఆదేశాలతోనే పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వారికో న్యాయం.. వీరికో న్యాయం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. న్యాయం చూడాల్సిన వాళ్లు కళ్లు మూసుకుని ‘పై నుండి’ వచ్చే ఆదేశాలతోనే చర్యలు తీసుకుంటున్నారని.. బాధితులకు న్యాయం జరగడం లేదని ప్రజలు కూడా వాపోతున్నారు. దీనికి తగ్గట్టే పోలీసుల వ్యవహారం కొనసాగుతున్నది. కొందరి అండదండతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కదిరిలో సీఐ రెచ్చిపోయి మహిళలను అని చూడకుండా దాడులకు పాల్పడ్డాడు. బూతులు తిడుతూ ఒక రౌడీలా బీభత్సం సృష్టించాడు. ఈ సంఘటన మరువకముందే మరో సీఐ రెచ్చిపోయారు. బాధితుడికి న్యాయం చేయాల్సి ఉండగా ఉల్టా అతడిపైకి తిరగబడ్డారు. బూతులు తిడుతూ.. ఎక్కువ చేస్తే లేని కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. పైగా ఆమె ఓ మహిళ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్ వైరల్ అయ్యింది. ఆమె దుర్భాషలాడడం.. చెప్పిన మాట వినకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో బాధితుడు భయాందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం జరగాలని మీడియా ముందుకు వచ్చాడు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం, ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాలు అక్రమంగా జరుగుతోంది. పచ్చగా ఉన్న కొండలు కనుమరుగవుతున్నాయి. నిత్యం లారీలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుండడంతో ఉన్న రోడ్లు పాడవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని మైలవరానికి చెందిన వెంకటకృష్ణ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు స్పందించడం లేదు. దీంతో మరోసారి వెంకటకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైలవరం ఎక్సైజ్ సీఐ గిరిజ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్ పై ఏంటి నీ బాధ అంటూ సీఐ మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణను బెదిరిస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ గా మారింది. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా ఉంది.
సీఐ: వెంకటకృష్ణ బాధితుడు: హ నమస్తే మేడమ్. సీఐ: నీ నమస్కారాలు పక్కన పెట్టు కానీ. ఎందుకు మాటిమాటికి కంప్లెట్లు ఇస్తున్నావ్. అది ఫేక్ కంప్లైట్ కదా. నీకు ఆ మాత్రం బుర్ర ఉందా అసలు? బాధితుడు: ఏవండి నిన్న కూడా అని మాట్లాడుతుండగా సీఐ కల్పించుకున్నారు. సీఐ: ఆగు నేను చెప్పేది విను. ఏం.. **తావ్ చెప్పు నువ్వు. నీ మీద పాత కేసులు తీసి ముద్దాయి అని రాస్తా. ఏం ఆడుకుంటున్నావా? పిచ్చోళ్లుగా కనిపిస్తున్నావా మేమేమన్నా? ఏం చేస్తావ్. బాధితుడు: రాస్కోండి సీఐ: నీవల్ల ఏమవుతది? చూడు పిచ్చిపిచ్చి వేషాలు వేశావంటే ఇదే చేస్తా. నువ్వు దొంగ కంప్లైట్లు ఇస్తే ఎలా? ఏం **తావు నువ్వు? అదే రాస్తా నేను. నువ్వొచ్చి చూపించు.
ఎధవ నాటకాలు ఆడుతావేంది నువ్వు? బాధితుడు: నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు వెళ్లట్లేదు? పలనా చోటకు అని మాట్లాడుతుండగా సీఐ రెచ్చిపోయారు. సీఐ: నువ్వు చెప్పినప్పుడు ఏంట్రా? ఏంట్రా నువ్వు చెప్పేది. ఏముంది అక్కడ (అక్రమ మైనింగ్ ప్రాంతం)? ఏం లేదు. ఏముంది అక్కడ? నువ్వు వచ్చి చూపించు. నువ్వేమైనా జీతమిస్తున్నావా నువ్వు చెప్పినట్టు వినడానికి. చెప్పు తెగిపోద్ది ఇలాంటి పిచ్చిపిచ్చి వాగుడు వాగడానికి. మర్యాదగా ఉండదు జాగ్రత్త నీకు. బాధితుడు: దొంగ కంప్లైట్ ఎట్ల అవుతదండి? సీఐ: నోర్మూయ్. వచ్చి చూపించు. పనికిమాలిన వేషాలు వేస్తే పళ్లు రాలిపోతాయి ఇంకొకసారి. నువ్వు వచ్చి చూపించు దమ్ముంటే. ఎధవ నాటకాలు ఆడుతున్నావు. జాగ్రత్త నాతోని.
సీఐ ఫోన్ కాలతో బాధితుడు వెంకటకృష్ణ భయాందోళనకు గురయ్యాడు. సీఐ ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారు.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వీడియో తీసి మీడియాకు పంపించాడు. అక్రమ మైనింగ్ అధికార పార్టీ అండదండలతో చేస్తున్నారని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యే సహాయంతో ఇది జరుగుతుందని తెలుస్తోంది.. ఇది పోలీసులకు కూడా తెలుసని వాపోయాడు. ఈ వ్యవహారం ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఏపీలో కలకలం రేపింది. సీఐ గిరిజ లాంటి వారు పోలీస్ శాఖలో చాలా మంది తయారయ్యారు. నిందితులకు వంత పాడుతూ బాధితులపై పోలీసులు రెచ్చిపోతుండడంతో ఆంధ్రప్రదేశ్ లో న్యాయం లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు. అందుకే ఏ కేసైనా తెలంగాణకు బదిలీ అవుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ, జనసేన, బీజేపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి పక్షాన ఆ పార్టీలు నిలబడుతున్నాయి.