ఎన్టీఆర్ జిల్లా (NTR District) చందర్లపాడు మండలం గుడిమెట్లలో వజ్రాల వేట మొదలైంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వజ్రాల కోసం వేల సంఖ్యలో జనాలు పోటెత్తారు. దాదాపుగా 5 వేల మంది వరకూ వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఈ మధ్యనే పల్నాడు జిల్లా (Palnadu District)కు చెందిన వ్యక్తి ఓ విలువైన వజ్రం (Diamond) దొరికిందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో వజ్రాల గుట్ట వద్దకు భారీ సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. ఆదివారం కావడం వల్ల ఉదయం 6 గంటల నుంచే వజ్రాల కోసం జనాలు బారులు తీరారు.
క్యారేజీలు పట్టుకొచ్చిమరీ వజ్రాల కోసం వేటను కొనసాగిస్తున్నారు. వజ్రాల వ్యాపారులు సైతం అక్కడి చేరుకున్నారు. వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న వారికి విజిటింగ్ కార్డులు ఇస్తూ పరిచయం చేసుకుంటున్నారు. అలాగే డైమండ్ (Diamond) దొరికితే తమకు కాల్ చేయమని వజ్రాల వ్యాపారులు చెబుతూ వస్తున్నారు.
గుడిమెట్ల ప్రాంతానికి గతంలో ఏడు పేటలు, ఏడు కోటలు అనే పేరు ఉండేది. గుడిమెట్ల అప్పట్లో సామాంత రాజుల రాజధానిగా ఉండేదని చరిత్ర ఉంది. అయితే వేములవాడ భీమ కవి శాపం కారణంగా గుడిమెట్లకు ప్రస్తుత దుస్థితి వచ్చిందని, ఎన్నో పురాతన వస్తువులు సైతం గుడిమెట్లలో దొరికాయని పెద్దలు చెబుతున్నారు. అందుకే జనాలు తుంపర జల్లులు పడితే చాలు ఆ ప్రాంతానికి చేరుకుని వజ్రాల కోసం వేటను కొనసాగిస్తున్నారు.