ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath)కు ఘోర ప్రమాదం తప్పింది. ఓ పనిపై వేరే ప్రాంతానికి వెళ్తుండగా అతడి కారు ప్రమాదానికి (Road Accident) గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ (TSRTC) బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు వెనుకభాగం దెబ్బతినగా.. టైర్ పగిలిపోయింది. అయితే డ్రైవర్ (Driver) అప్రమత్తమవడంతో యండమూరి వీరేంద్రనాథ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పుస్తకప్రియులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
పుస్తకప్రియులకు యండమూరి వీరేంద్రనాథ్ సుపరిచతులే. ఆయన నవలలు, కథలు యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటాయి. అలాంటి రచనలు చేస్తున్న యండమూరి వీరేంద్రనాథ్ కారులో మంగళవారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా (Siddipet District) కొండపాక (Kondapaka) మండలం తిమ్మారెడ్డిపల్లి శివారుకు చేరుకోగానే కారును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గోదావరిఖని (Godavarikhani) డిపోకు చెందిన బస్సు అదుపు తప్పి ఢీకొట్టడంతో కారు వెనుకభాగం దెబ్బతిన్నది. టైర్ కూడా పగిలిపోయింది. అయితే ప్రమాదం నుంచి డ్రైవర్ తోపాటు యండమూరి వీరేంద్రనాథ్ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం వేరే వాహనంలో ఆయన కరీంనగర్ వెళ్లారు. కాగా ఈ ప్రమాదంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. డ్రైవర్ తప్పేం లేదని.. వారిని వదిలేయాలని పోలీసుల (Telangana Police)కు యండమూరి వీరేంద్ర నాథ్ చెప్పారు.