»Mylavaram Mla Vasantha Krishna Prasad Supported To Capital Amravati
YS జగన్ కు మళ్లీ షాకిచ్చిన మైలవరం ఎమ్మెల్యే..
అమరావతి అయితే తమ పరిస్థితులు మారుతాయని.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మైలవరం ప్రజలు భావించారు. కానీ దానికి విరుద్ధంగా అమరావతిని నామమాత్రం చేసి విశాఖపట్టణం ప్రధాన రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ ప్రకటించడంపై మైలవరం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం నీకు ఢోకా లేదని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) హామీ ఇచ్చిన అనంతరం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) వ్యవహారంలో మార్పు రాలేదని కనిపిస్తోంది. గతంలో బాలకృష్ణ (Balakrishna)కు మద్దతుగా బ్యానర్లు ప్రకటించడం.. బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలను సమర్ధించడం వంటి వాటితో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారుతారని విస్తృత ప్రచారం జరిగింది. దీంతో వెంటనే సీఎం జగన్ రంగంలోకి దిగాడు. తాడేపల్లికి ప్రత్యేకంగా పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చ చేసిన విషయం తెలిసిందే. తాను వైసీపీతోనే ఉంటానని నాడు ప్రకటించాడు. అయితే ప్రభుత్వ తీరుపై అసంతృప్తి మాత్రం తగ్గినట్టు కనిపించడం లేదు. సీఎం జగన్ నిర్ణయానికి విరుద్ధంగా సంచలన ప్రకటన చేశాడు. తాను రాజధానిగా అమరావతి (Capital Amaravati)కే మద్దతు ఇస్తానని ప్రకటించి వైఎస్సార్ సీపీలో కలకలం రేపాడు.
ఎన్టీఆర్ జిల్లా (NTR District)లోని మైలవరం (Mylavaram) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ జగన్ ఆదేశాలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాడు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం కవులూరులో పర్యటించాడు. ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజధాని విషయమై ఆ గ్రామ స్థానికుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు ఎమ్మెల్యేను నిలదీశాడు. ‘అమరావతి రాజధాని వ్యవహారంపై ఒక ఎమ్మెల్యేగా మీరు ఎందుకు స్పందించడం లేదు’ అని ప్రశ్నించాడు. రాజధానిపై గందరగోళం ఏర్పడడంతో తమ భూముల ధరలన్నీ తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి ఎవరు బాధ్యులని రాంబాబు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే స్పందించారు. ‘వ్యక్తిగతం నేను రాజధానిగా అమరవాతికే మద్దతు ఇచ్చా. అయితే ప్రభుత్వ విధానానికి మాత్రం నేను కట్టుబడి ఉండాల్సిందే’ అంటూ చెప్పి అక్కడి నుంచి ఎమ్మెల్యే జారుకున్నారు.
ఎమ్మెల్యే మాటలు చూస్తుంటే ఆయన మూడు రాజధానులకు మద్దతు తెలపడం లేదని తెలుస్తోంది. బలవంతంగా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడాల్సి ఉంటోందని చెప్పకనే చెప్పారు. అమరావతి ప్రాంతానికి సమీపంలోనే ఆయన నియోజకవర్గం ఉంది. రాజధానిగా అమరావతి కావడంపై మైలవరం నియోజకవర్గ ప్రజలు గంపెడాశలో ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ మూడు రాజధానుల పేరిట డ్రామాలు చేస్తుండడంతో ఈ నియోజకవర్గంలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. బలవంతంగానే అధికార పార్టీలో కొనసాగుతున్నారని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.
చదవండి: CPRతో దక్కిన మరో ప్రాణం.. శభాష్ కానిస్టేబుల్ కిరణ్
రాజధానిగా అమరావతి అయితే తమ పరిస్థితులు మారుతాయని.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మైలవరం ప్రజలు భావించారు. కానీ దానికి విరుద్ధంగా అమరావతిని నామమాత్రం చేసి విశాఖపట్టణం ప్రధాన రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ ప్రకటించడంపై మైలవరం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ నిర్ణయంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భూముల ధరలు పడిపోయాయి. నాడు కోట్లలో పలికిన భూముల ధరలు నేడు లక్షలు పలుకుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని మైలవరం ప్రజలు హెచ్చరిస్తున్నారు.