»Tspsc Secretary Anita Ramachandran Attended The Sit Inquiry
TSPSC Paper Leak: సిట్ విచారణకు హాజరైన TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు TSPSC కార్యదర్శి సెక్రటరీ అనితా రామచంద్రన్(Anita Ramachandran)కి ఏప్రిల్ 1న హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె నేడు సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సెక్రటరీ నుంచి అధికారులు వాంగ్మూలాన్ని స్వీకరిస్తున్నారు.
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ క్రమంలో అందరినీ విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్, సెక్రటరీ సహా బోర్డు సభ్యులకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్(Anita Ramachandran)కి విచారణ బృందం నోటీసులు జారీ చేయగా…నేడు ఆమె సిట్ అధికారుల ఎదుట హాజరైంది. దీంతో అధికారులు ఆమె నుంచి వాంగ్మూలాన్ని సేకరిస్తున్నారు.
మరోవైపు బోర్డు సభ్యుడు లింగారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా విచారించనున్నారు. అలాగే ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ అనితా రామచంద్రన్‌కు పీఏగా పనిచేశారు. బోర్డు సభ్యుడు లింగారెడ్డికి రమేష్ వ్యక్తిగత సహాయకుడు. బోర్డు సభ్యులు సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ, రమావత్ ధన్ సింగ్, కోట్ల అరుణ కుమారిని కూడా సిట్ విచారించనుంది.
అయితే ఇప్పటికే ప్రవీణ్, రమేశ్‌లను అరెస్ట్ చేసిన సిట్.. మరో నిందితుడు షమీమ్‌తో పాటు వారిని మూడు రోజులుగా విచారిస్తోంది. మూడోరోజు కస్టడీ ముగియడంతో కింగ్ కోఠి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటి వరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్-1 పేపర్లు ఐదుగురికి లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 15కు చేరగా.. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి, అతని బావమరిది ప్రశాంత్‌రెడ్డితో పాటు నిందితుల సంఖ్య 16కు చేరింది.
TSPSCలో ఇంకా ఎంత మంది ఉద్యోగులకు లీకేజీ గురించి తెలుసు అనే అంశాలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఈ పేపర్ లీకేజీకి సంబంధించి నలుగురు నిందితుల కస్టడీ మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. వీరిని విచారించిన క్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయని సమాచారం. పేపర్ కొన్న వారంతా అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుని రేణుక భర్త ధాక్యా నాయక్, ఆమె తమ్ముడు రాజేశ్వర్ కు డబ్బులు ఇచ్చారని తెలిపారు.
మరోవైపు పేపర్ లీకేజీ కేసులో నిందితులను రక్షించేందుకు సిట్ ప్రయత్నించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టుకు నివేదిక సమర్పించకముందే కేటీఆర్ వివరాలు తెలుసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐ, ఈడీచే విచారించాలని కాంగ్రెస్ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు.