తండ్రి లేడు.. తల్లి కూలీ పనులు చేస్తూ కష్టపడి చదివిస్తోంది. బుద్ధిగా చదువుకుంటున్న అమ్మాయిని తోటి విద్యార్థులు కన్నేశారు. ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆమెకు ప్రలోభాలు చూపించి లొంగ దీసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాళ్లు మొక్కుతా వదిలేయండి అని బతిమిలాడినా వినలేదు. అడవికి తీసుకెళ్లి ఒక్కరు కాదు ఏకంగా ముగ్గురు అత్యాచారం చేశారు. పాశవికంగా ప్రవర్తించడంతో బాలిక అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ సంఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. భర్తను కోల్పోవడంతో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని వరంగల్ లోని కాశీబుగ్గ ప్రాంతానికి వచ్చి అద్దె ఇంట్లో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. పెద్ద కూతురు ఇంటర్ రెండో సంవత్సరం, చిన్న కుమార్తె మొదటి ఏడాది చదువుతోంది. అయితే చిన్న అమ్మాయికి అదే కళాశాలలో చదువుతున్న స్నేహితురాలి ద్వారా నర్సంపేట సమీపంలోని మాదన్నపేటకు చెందిన దూడల ప్రభాస్ (22)తో పరిచయమైంది. ప్రేమ, పెళ్లి పేరిట బాలికను ప్రభాస్ నమ్మించాడు. పలుసార్లు ఆ బాలికను మాదన్నపేటకు రప్పించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈనెల 24న మాట్లాడుకుందామని రమ్మని బాలికను మాదన్నపేటకు రప్పించాడు. ఇంట్లో కలవడం కష్టమని ఖిల్లా వరంగల్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లాడు. అనంతరం అతడి స్నేహితులు భరత్, బన్నీ చేరుకున్నారు. ఏం చేస్తున్నారని బెదిరించినట్టు నటించి బాలిక సెల్ ఫోన్ లాక్కున్నారు. అనంతరం ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వద్దని బతిమిలాడినా వినకుండా క్రూరంగా ప్రవర్తించారు. అనంతరం బాలికను ఇంటికి పంపించి వేశాడు.
ఇంట్లో తల్లికి విషయం చెప్పి బాలిక రోదించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చిన్న వయసులోనే ఇంతటి క్రూర దాడులకు పాల్పడడం సమాజాన్ని కలచివేస్తోంది. సెల్ ఫోన్లు విపరీతంగా వాడడం, చెడు స్నేహాలతో నేటి తరం పాడవుతోందని ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.