కరోనా కేసులు మళ్లీ నమోదవుతూ వస్తున్నాయి. దీనిపై ఈ మధ్యనే డబ్ల్యూహెచ్ఓ కూాడా పలు సూచనలు చేసింది. తాజాగా తెలంగాణలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. నేడు వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం రేపింది. వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ తరుణంలో వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు.
ఎంజీఎంలోని పిల్లల వార్డులో ప్రత్యేకంగా 20 పడకలతో ఓ వార్డును ఏర్పాటు చేసి ఆ ఆరుగురు చిన్నారులతో అందులో ఉంచారు. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ వచ్చిన వారికి కాకతీయ మెడికల్ కాలేజీలోని వైరాలజీ డిపార్ట్ మెంట్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు.
ఈ మధ్యనే నీలోఫర్ ఆస్పత్రిలో కూడా ముగ్గురు చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. వారికి ప్రత్యేక చికిత్సను వైద్యులు అందించారు. తాజాగా కరోనా మహహ్మారి కలవరానికి గురి చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు సైతం కొవిడ్ సోకి కేసులు నమోదవుతుండటంతో తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.