»Sri Chaitanya Student Commited To Suicide In Hyderabad
Narsingi వేధింపులు తాళలేక శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థుల అందరి ముందు కొట్టడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ ఘటనతో కలత చెందిన సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు ఈ ఘటనను ఆలస్యంగా గుర్తించిన విద్యార్థులు అనంతరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాత్విక్ మృతి చెందాడు.
తెలంగాణ (Telangana)లో విద్యార్థుల ఆత్మహత్య (Suicide)లు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వైద్య విద్యార్థిని ప్రీతి (Preethi), బీటెక్ విద్యార్థిని రక్షిత (Rakshitha) బలవన్మరణ ఘటనలు మరువకముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలో అధ్యాపకుల వేధింపులు (Harassment) భరించలేక అతడు వసతిగృహంలోని గదిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ (Hyderabad)లో కలకలం రేపింది. విద్యార్థి ఆత్మహత్యతో నార్సింగి (Narsingi) ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల (Sri Chaitanya College)లో సాత్విక్ (Sathvik) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో అధ్యాపకులు వేధింపులకు పాల్పడుతున్నారు. వసతిగృహం (Hostel)లో అందించే ఆహారం (Food), సౌకర్యాలు (Facilities) బాగా లేవని తరచూ సాత్విక్ కుటుంబసభ్యులతో చెబుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పరీక్ష రాస్తుండగా అడ్మిన్, ప్రిన్సిపల్ ఆచార్య దాడికి పాల్పడ్డాడు. విద్యార్థుల అందరి ముందు కొట్టడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ ఘటనతో కలత చెందిన సాత్విక్ మంగళవారం రాత్రి తరగతి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు ఈ ఘటనను ఆలస్యంగా గుర్తించిన విద్యార్థులు అనంతరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాత్విక్ మృతి చెందాడు.
ఈ సంఘటనతో నార్సింగి ప్రాంతంలోని శ్రీచైతన్య కళాశాల ముందు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వారికి తోడు సాత్విక్ తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. తల్లిదండ్రులు రోడ్డుపై విలపిస్తూ ధర్నా చేశారు. వీరి ఆందోళనతో నార్సింగి ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు సర్ది చెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా సాత్విక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ, వార్డెన్లు చైతన్య, నరేశ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ పరిశీలించి, విద్యార్థులను విచారించి వారిపై చర్యలు తీసుకుంటామని నార్సింగి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.