»Software Engineer Died In Movie Theatre With Heart Attack
Heart Attack థియేటర్ లో సినిమా చూస్తూ కుప్పకూలిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు. వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
సాఫ్ట్ వేర్ (Software) శిక్షణ (Training) తీసుకున్నాడు.. అద్భుత ప్రతిభ కనబర్చి ఉద్యోగం (Job) సాధించాడు. కుటుంబమంతా అతడికి ఉద్యోగమొచ్చిన ఆనందంలో మునుగుతోంది. వారం రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఆలోపే కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సరదాగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో సరదా కోసం సినిమా చూసేందుకు థియేటర్ (Movie Theatre)కు వెళ్లాడు. థియేటర్ లోపలికి వెళ్లిన ఆ యువకుడు బయటకు మాత్రం శవంగా బయటకొచ్చాడు. గుండెపోటు (Heart Attack)తో థియేటర్ లోనే కుప్పకూలిపోయిన సంఘటన తెలంగాణ (Telangana)లో చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఉద్యోగం చేరి కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే శాశ్వతంగా దూరమైపోవడం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా (Khammam District) మధిర (Madhira) మండలం నక్కలగరుబు గ్రామానికి చెందిన కొట్టే పెద్దకృష్ణ, రాధా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు మురళీకృష్ణ (26) (Kotte Muralikrishna). తాపీమేస్త్రీగా పనులు చేస్తూ పెద్దకృష్ణ పిల్లలను బాగా చదివించారు. కుమార్తెలకు వివాహం చేసి అత్తారింటికి పంపించేశాడు. ఒక్క కొడుకు కావడంతో మురళీకృష్ణను గారాబంగా పెంచారు. బీటెక్ ఉత్తీర్ణుడైన కుమారుడికి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్పించారు. శిక్షణ పూర్తవడంతో అతడికి హైదరాబాద్ (Hyderabad)లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Software Engineer)గా ఉద్యోగం వచ్చింది. మార్చి 17న విధుల్లో చేరాల్సి ఉంది. ఈ ఆనందంలోనే హైదరాబాద్ కు చేరుకున్నాడు.
హైదరాబాద్ లో స్నేహితు (Frineds)లతో కలిసి ఈనెల 9న గురువారం సాయంత్రం సినిమాకు వెళ్లాడు. థియేటర్ లో సినిమా చూస్తున్న సమయంలోనే మురళీకృష్ణకు గుండెపోటు వచ్చింది. ఎలాంటి అలజడి లేకుండానే థియేటర్ సీటులోనే కుప్పకూలిపోయాడు. అతడి పరిస్థితి గమనించి స్నేహితులు లేపగా అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అతడి మరణంతో నక్కలగరుబు గ్రామంలో విషాద వాతావరణం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అర్ధాంతరంగా ఉన్న ఒక్క కుమారుడు తమను వదిలేశాడని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
కాగా తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో అందరిలోనూ భయాన వాతావరణం ఏర్పడింది. సంతోషంగా ఉన్న సమయంలోనే ఈ సంఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. నిండు ఆరోగ్యంతో ఉన్నవాళ్లు ఆకస్మిక మరణాలు పొందుతుండడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. చేతికొచ్చిన వారు.. కుటుంబానికి ఆసరాగా ఉన్నవారు హఠాన్మరణాలతో ఆ కుటుంబాలు తీరని శోకంలో మునుగుతున్నాయి. వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు. వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.