మాంచి గ్రామీణ (Village Background) నేపథ్యంలో సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు వేణు టిల్లు అలియాస్ వేణు యెల్దండి (Venu Yeldandi). తెలంగాణ సంస్కృతి, అనుబంధాలపై తెరకెక్కించిన ‘బలగం’ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తోంది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశామని ప్రేక్షకులు చెబుతున్నారు. క్రమంగా ఈ సినిమా షోలు పెరుగుతున్నాయి. తొలిసారి దర్శకత్వం చేపట్టినా కొన్ని తప్పులను మినహాయిస్తే దర్శకుడి (Director)గా వేణు విజయవంతమయ్యాడనే చెప్పవచ్చు. ప్రస్తుతం సినిమా విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాపై వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న వేణు తాజాగా తనకు నటుడిగా అవకాశం ఇచ్చిన జబర్దస్త్ (Jabardasth Show) విషయమై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇన్నాళ్లు విబేధాల వలన వేణు జబర్దస్త్ మానేశాడనే వార్తలు వినిపించాయి. తాజా ఇంటర్వ్యూలో అవి అవాస్తవాలని తేల్చేశాడు. తాను ఆ షో వీడడానికి కారణాలు వివరించాడు.
‘టీమ్ లో విబేధాలు (Clashes) ఉండడంతో జబర్దస్త్ మానేశానని చెప్పడం వాస్తవం కాదు. నేను జబర్దస్త్ వదిలేయడానికి కారణం సినిమాపై ఇష్టమే. సినిమాపై ఇష్టంతోనే ఆ షోను వదిలేశా. మొదటి నుండి నా గమ్యం.. లక్ష్యం సినిమానే. మంచి పారితోషకం (Remuneration) వస్తున్న సమయంలోనే నేను బయటకొచ్చా. నేను ఉన్నప్పుడు రేటింగ్ (Rating) కూడా బాగుంది. కానీ సినిమా కోసం బయటకు వచ్చా అంతే!’ అని వేణు చెప్పుకొచ్చాడు.
తెలంగాణ(Telangana)కు చెందిన వేణు కొన్నేళ్లుగా బుల్లితెరపై అలరించాడు. మెగా ఫోన్ (Mega Phone) పట్టుకుని దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. నిర్మాత దిల్ రాజు ప్రోత్సాహంతో పరిశ్రమలోకి కొత్త దర్శకుడిగా అడుగు పెట్టాడు. ప్రియదర్శి, కావ్య నటీనటులుగా వేణు దర్శకత్వంలో ‘బలగం’ సినిమా రూపుదిద్దుకుంది. బీమ్స్ సిసిలియో (Bheems Cecilio) సంగీతం ఈ సినిమాకు కొండంత బలంగా నిలిచిన విషయం తెలిసిందే. బలరామ నర్సయ్యో, ఊరూ పల్లెటూరు అనే పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు అండదండగా నిలుస్తోంది. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపించారు.