»K Kavitha Deeksha Jp Nadda Phone Called To Bandi Sanjay And Dk Aruna
K Kavitha Deekshaపై బీజేపీ అలర్ట్.. సంజయ్, డీకే అరుణకు నడ్డా ఫోన్
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయం. మహిళా సమస్యలపై పోరాడుతున్న తీరు భేష్. తెలంగాణ మహిళలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలి.
మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది. ఆమె నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దీక్ష ఊహించని రీతిలో విజయవంతం కావడంతో బీజేపీ అప్రమత్తమైంది. కవిత దీక్ష చేస్తానని ప్రకటించినప్పటి నుంచి బీజేపీ అప్రమత్తంగా ఉంది. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు వచ్చాయి. అయితే కవిత మార్చి 11న విచారణకు హాజరవుతానని ప్రకటించడంతో దీక్ష నిర్ణయించిన ప్రకారం యథావిధిగా కొనసాగింది. ఈ దీక్షకు అన్ని మీడియా సంస్థలు ప్రాధాన్యమిచ్చాయి. దేశంలోని విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి.
అయితే తెలంగాణలో ఈ దీక్ష విషయం చర్చనీయాంశం కాకుండా బీజేపీ అకస్మాత్తుగా ‘మహిళా గోస – బీజేపీ భరోసా’ దీక్ష అనే కార్యక్రమం చేపట్టింది. మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉన్నట్టుండి ఈ కార్యక్రమం చేపట్టడం ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమేనని తెలుస్తున్నది. కాగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో చేపట్టిన ఈ దీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఇతర నాయకులు డీకే అరుణ, విజయశాంతి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దీక్ష సందర్భంగా బండి సంజయ్ కుమార్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. ‘మహిళా గోస – బీజేపీ భరోసా’ దీక్ష చేయడంపై అభినందించారు.
‘తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయం. మహిళా సమస్యలపై పోరాడుతున్న తీరు భేష్. తెలంగాణ మహిళలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలి. మహిళా సమస్యల పరిష్కారం కోసం మరింతగా పోరాడాలి’ వారిద్దరికి నడ్డా సూచించారు. ఒక దీక్షకు పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఫోన్ చేసి అభినందించారంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. కవిత దీక్షపై రాష్ట్రంలో అంతగా ప్రచారం కాకుండా బీజేపీ అడ్డుపుల్లలు వేస్తున్నది.
ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. దీక్షలు చేసే అర్హత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ మహిళలు తలదించుకునే దుస్థితి తెచ్చారని విమర్శించారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తమదని తెలిపారు. ‘కవిత చేసే దందాలో తెలంగాణ మహిళలకు వాటా ఇస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీలో మహిళలే లేరు? కవిత పాపులారిటీ తగ్గిపోతుందని.. బీఆర్ఎస్ పార్టీలో వేరే మహిళలను మాట్లాడనివ్వరు’ అని బండి సంజయ్ పేర్కొన్నాడు.