KMM: వైరాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. పాత బస్టాండ్ దగ్గర ఓ వ్యక్తిని తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. పాదచారికి తీవ్ర గాయాలయ్యాయి. కారు హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళుతున్నట్లు తెలుస్తోంది. వైరా పోలీసులు క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
బాపట్ల: బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెం గ్రామం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రెండు బైక్‌లు పరస్పరం ఢీకొనగా ఇద్దరికీ గాయాలయ్యాయి. నంగన గోపయ్య(35) స్వల్ప గాయాలు కాగా గంప ఈశ్వర్(18) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
SKLM: టెక్కలి మండల కేంద్రంలోని బ్రాహ్మణవీధి జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మెలియాపుట్టి నుంచి కోటబొమ్మాలి మండలం చుట్టుగుండానికి గొర్రెలు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముద్ద దండాసి అనే గొర్రెల కాపరికి కాలు విరిగింది. ఘటనా స్థలంలో 4 గొర్రెలు చనిపోయాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
MBNR: దౌల్తాబాద్ మండలంలోని చల్లాపూర్‌లో చిరుత లేగదూడపై దాడిచేసి చంపిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోలుముల సాయప్ప రోజులాగే తన పొలం దగ్గర పశువులను కట్టేసి రాగా.. చిరుతలు లేగదూడను లాక్కెళ్ళి చంపేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అప్రమత్తమైన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు.
ELR: ప్రియురాలు తన ప్రేమను తిరస్కరించిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. ముదినేపల్లి మండలం చినపాలపర్రుకు చెందిన యువకుడు అజయ్ (19) ఒక యువతి తన ప్రేమను తిరస్కరించిందని ఈనెల 22న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై వీర భద్రరావు తెలిపారు.
GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని క్వారీలో మృతదేహం కలకలం రేపుతోంది. బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన స్థానికులు క్వారీలోని నీటిలో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా, మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ELR: ఏలూరు నగరంలోని స్థానిక తంగెళ్లమూడి ఎస్ఎంఆర్ నగర్లో ఏలూరు రూరల్ పోలీసులు మంగళవారం పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్సై దుర్గా ప్రసాద్ తన సిబ్బందితో కలిసి 30 మంది పేకాట ఆడుతున్న పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి వద్ద నుంచి రూ. 8.10 లక్షల నగదును సీజ్ చేశారు.
NLR: ప్రమాదవశాత్తు కాలుజారి మహిళ చనిపోయిన ఘటన నెల్లూరులో జరిగింది. రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లో లక్ష్మీదేవి నివసిస్తున్నారు. మూడో అంతస్తు నుంచి చెత్తను కిందకు వేస్తుండగా కాలుజారి పడిపోయారు. తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
SKLM: పాతపట్నం మండలం పూతికగూడ గ్రామానికి చెందిన సవర పార్వతి అనే మహిళ నుంచి 2.5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు పాతపట్నం ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు మంగళవారం తెలిపారు. గ్రామంలో చేపట్టిన తనిఖీల్లో నాటుసారా పట్టుపడగా ఆమెను నరసన్నపేట కోర్టులో హాజరుపరచగా.. ఆమెకు జనవరి 3వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
కృష్ణా: గుడివాడ పట్టణంలోని మార్కెట్ సెంటర్‌లో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AKP: ఎస్.రాయవరం మండలం సీతారాంపురంలో పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. ఎస్సై విభీషణరావు ఆధ్వర్యంలో మహిళ కానిస్టేబుల్‌తో కలిసి నిర్వహించిన దాడుల్లో రూ. 67 వేల నగదు, 10 మొబైల్ ఫోన్లు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
SKLM: బలగ మెట్టు జంక్షన్ వద్ద N. శ్యామల అనధికారికంగా మద్యం విక్రయిస్తుండడంపై రెండో పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఆమె నుంచి రూ. 2, 530 విలువ చేసే 21 అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై సీఐ ఈశ్వర్ ప్రసాద్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు తెలిపారు.
NLR: ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేసిన సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన భానుప్రకాష్ (23), అతడికి సహకరించిన మరో ఐదుగురిపై 2014లో పోక్సో నమోదైంది. జడ్జి సిరిపిరెడ్డి సుమ విచారణ చేపట్టి పదేళ్ల శిక్షతోపాటు రూ. 20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
పల్నాడు: బొల్లాపల్లి(M) వెల్లటూరు సమీపంలోని కాలువలో నాగరాజు, భార్గవి దూకిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నాగరాజు(37) చనిపోగా, భార్గవి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరిద్దరికీ వేరువేరుగా పెళ్లిళ్లు జరిగి పిల్లలున్నారు. కలిసి బతకలేమని గ్రహించి బంధువుల ఎదుటే కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
KMM: వైరా మండలంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వంశీ కృష్ణ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.