తెలంగాణలో (Telangana) వచ్చే ఎన్నికల కోసం పోటీ చేసే స్థానం ఖరారైన ఏకైక వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy). ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ (Huzurabad) స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. టికెట్ అతడికేనని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KT Rama Rao) గతంలోనే ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో కౌశిక్ విస్తృత పర్యటన చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ‘ఒక చాన్స్ ఇవ్వండి. కేసీఆర్ (KCR) కాళ్లు మొక్కి అయినా నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తీసుకొస్తా’ అని ప్రజలను కౌశిక్ రెడ్డి కోరాడు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం చల్లూరు గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కైనా రూ.వెయ్యి కోట్లు తెచ్చి హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ మాకు బలం.. కార్యకర్తలే మా బలగం. బడుగు బలహీన వర్గాల పార్టీ మనది. పార్టీ కోసం ప్రతి కార్యకర్త కష్ట పడి పని చేయాలి. సీఎం కేసీఆర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది’ అని తెలిపాడు. ఇక బండి సంజయ్, ఈటలపై కౌశిక్ తీవ్ర విమర్శలు చేశారు. ‘బండి సంజయ్, ఈటల రాజేందర్ లకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. ఇక బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుందో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నాడు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న కౌశిక్ హుజురాబాద్ నియోజకవర్గంలో బలమైన నాయకుడు. అప్పట్లో బీఆర్ఎస్ లో ఉన్న ఈటలకు గట్టి పోటీనిచ్చాడు. అనంతరం ఈటలను బర్తరఫ్ చేయడం.. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం.. ఉప ఎన్నిక ఇలా పరిణామాలు వేగంగా మారడంతో కౌశిక్ గులాబీ కండువా కప్పుకున్నాడు. ఉప ఎన్నికలో టికెట్ ఆశించగా ‘ఇప్పుడు కాదు. తర్వాత చూద్దాం’ అని గులాబీ బాస్ ఆదేశాలతో అప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం పని చేశాడు. ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ ఎమ్మెల్సీగా కౌశిక్ కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది చివరలో జరుగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కారు గుర్తుపై కౌశిక్ పోటీ చేయడం ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ నాయకుడు గెల్లు శ్రీనివాస్ కు కార్పొరేషన్ పదవి కట్టబెట్టి కౌశిక్ కు లైన్ క్లియర్ చేశారు. రంజీ క్రికెటర్ అయిన కౌశిక్ ఎమ్మెల్యే కావడం ఆశయం. దీనికోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నాడు.