»Telangana Pm Narendra Modi Hyderabad Tour Only Two Hours
Modi Tour తెలంగాణలో రెండు గంటలే మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
గతంలో రెండు సార్లు ప్రధాని పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఏం జరిగినా ఈసారి ప్రధాని పర్యటన తప్పక ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టుబట్టారు.
తెలంగాణ పర్యటనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. పలుసార్లు వాయిదా పడిన పర్యటన ఎట్టకేలకు ఖాయమైంది. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అయితే కేవలం రెండు గంటలు మాత్రమే హైదరాబాద్ లో పర్యటించనుండడం గమనార్హం. ఒక్క పూట మోదీ బిజీబిజీగా ఉండనున్నాడు.
ఈనెల 8వ తేదీన శనివారం ఉదయం 11.30 ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగనున్నారు. అక్కడి నుంచి ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. 11.45- 12 గంటల మధ్యలో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం పరేడ్ మైదాన్ కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగం చేయనున్నారు. అదే వేదికపై నుంచి 12.18- 1.20 గంటల మధ్య తెలంగాణలో పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అటు నుంచి 1.30 గంటలకు బేగంపేట నుంచి ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
కాగా ఈ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తో ప్రధాని పర్యటన ఉంటుందో లేదోననే సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో రెండు సార్లు ప్రధాని పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఏం జరిగినా ఈసారి ప్రధాని పర్యటన తప్పక ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టుబట్టారు. కాగా ఈ ఏడాదిలో మోదీ తెలంగాణలో చేపడుతున్న మూడో పర్యటన ఇది.