కొత్త వేరియంట్ కలవరపెడుతున్న తరుణంలో ఓ వ్యక్తి కోవిడ్ లక్షణాలతో ఎంజీఎంలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. ఆ పేషెంట్‌ను వైద్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కరోనా మహమ్మారి మళ్ళీ టెన్షన్ పెడుతోంది. దేశవ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య సిబ్బంది అలర్ట్ అయ్యి ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరి చేస్తున్నారు. అయితే కొత్త వేరియంట్ లక్షణాలతో ఎంజీఎంకు వచ్చిన ఓ పేషెంట్‌ను అక్కడి వైద్య సిబ్బంది కోవిడ్ వార్డుకు తరలించి ఇసోలేషన్లో ఉంచి పరీక్షలు చేపట్టారు.
వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో మాస్క్ రూల్స్ కచ్చితంగా పాటిస్తున్నారు. మాస్క్ ధరించకపోతే ఆసుపత్రిలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఆసుపత్రి పరిసరాల్లో నో మాస్క్ నో ఎంట్రీ పోస్టర్స్ ఏర్పాటు చేశారు. పేషెంట్లు ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్ కలవరపెడుతున్న తరుణంలో ఓ వ్యక్తి కోవిడ్ లక్షణాలతో ఎంజీఎంలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ పేషెంట్ దగ్గు, జలుబు, ఫ్లూ లక్షణాలతో ఇబ్బందులు పడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చారు.
ఎంజీఎంకు రావడానికంటే ముందు ప్రైవేట్ ల్యాబ్‌లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించడంతో ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఎంజీఎంలో ఇప్పటికే 50 బెడ్స్‌తో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. వైద్యులు కోవిడ్ లక్షణాలతో వచ్చిన పేషెంట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ వేరియంట్ పై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంజీఎం వైద్య సిబ్బంది చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి రావాలని ఆదేశించారు.