అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మార్కెట్లో దాదాపు 1000 దుకాణాలు ఉండగా…. అందులో 700 దుకాణాలు అగ్నికి ఆహుతైపోవడం గమనార్హం.
ముందుగా… రెండు దుకాణాలకు అగ్ని అంటుకుందని.. వాటి నుంచి ఇతర దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. దాదాపు షాపులన్నీ వెదురు తో చేసినవి కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు దాదాపు 4 గంటల పాటు శ్రమించి మంటలను నియంత్రించారు. కానీ అప్పటికే దాదాపు 700 షాపులు బూడిదయ్యాయి.
ఆ మార్కెట్ కు దగ్గర్లోనే ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అయితే, వారు సకాలంలో స్పందించి ఉంటే ఈ స్థాయిలో ఆస్తినష్ట జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా వెలిగించిన దీపాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే.. అదృష్టవశాత్తు… ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.