ఉద్యోగం కోసం ఐఏఎస్ అధికారిణిని ప్రసన్నం చేసుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ సాహసానికి ఒడిగట్టారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంపన్నులు ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిపోయాడు. భయపడిపోయిన అధికారిణి కేకలు వేయడంతో కలకలం రేగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్న ఓ మహిళా ఐఏఎస్ సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటారు. ఆమెను ఓ ఉప తహసీల్దార్ (48) ఫాలోవర్ గా ఉన్నాడు. ఆమె ట్వీట్లను పలుసార్లు రీట్వీట్లు చేశాడు. పలుసార్లు తన ఉద్యోగం విషయమై అధికారిణికి ట్వీట్ చేశాడు. స్పందన రాకపోవడంతో మేడమ్ ను నేరుగా కలిసి మాట్లాడాలని భావించాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట రాత్రి 11.30 గంటల ప్రాంతంలో కారులో అధికారిణి ఇంటికి వెళ్లాడు.
ఆమె గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తుండడంతో అక్కడికి కారులో చేరుకున్నాడు. తన మాయమాటలతో సెక్యూరిటీని నమ్మించి లోపలకు వచ్చాడు. ఇంటి లోపలికి వెళ్లి తట్టగా ఐఏఎస్ అధికారిణి తలుపు తీశారు. అయితే అర్ధరాత్రి కావడంతో ఎదురుగా వచ్చింది ఎవరో గుర్తు పట్టలేకపోయారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని బలవంతం చేయసాగాడు. దీంతో వెంటనే అధికారిణి కేకలు వేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు పట్టించారు. అతడితోపాటు అతడితోపాటు అతడి స్నేహితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.