మహమ్మారి కరోనా వైరస్ (Corona Virus) మళ్లీ తీవ్రంగా దాడి చేస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐదో వేవ్ (Fifth Wave) వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే రోజురోజుకు పాజిటివ్ కేసులు (Positive Cases) పెరుగుతున్నాయి. ఒక్క రోజే పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మళ్లీ కరోనా (Covid-19) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసుల వ్యాప్తి పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం (Govt of India) సూచిస్తోంది.
నిన్న ఏడు వేలకు కేసులు నమోదవగా తాజాగా కేసుల సంఖ్య పదివేలు దాటాయి. బుధవారం ఒక్కరోజే నిర్వహించిన పరీక్షల్లో 10,158 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కిందటి రోజు కన్నా 30 శాతం అధికంగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య 44,998కి చేరింది. అన్ని వేవ్ లు కలిపి దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,42,10,127కు చేరుకుంది. కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది. కొత్త వేరియంట్ లు ఉత్పన్నమవుతున్నాయి. దీనివలన వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బీబీ.1.16 అనే వేరియంట్ ప్రస్తుతం కేసులు పెరగడానికి కారణంగా కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతోనే ఫిబ్రవరిలో 21.6 శాతం ఉన్న కేసులు 35.8 శాతానికి చేరాయి.