»Central Government New Law To Movie Piracy Cinematograph Amendment Bill 2023
Piracy: కట్టడికై కేంద్రం కొత్త చట్టం..ఇకపై కఠిన చర్యలు
సినీ పరిశ్రమపై ఆధారపడుతున్న వారికి ఉపకరించేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకువచ్చింది. సినీ పైరసీ దారులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమయింది. సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం సక్రమంగా అమలు జరిగే అవకాశం ఉందా? ఈ చట్టం వల్ల మన దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న పైరసీకి అడ్డుకట్ట పడనుందా? ఈ విషయమై నిపుణులు ఏం అంటున్నారు. సినీ ప్రముఖులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చుద్దాం.
సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లు చట్ట రూపం దాల్చడంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం అమలు జరిగితే పైరసీ(movie piracy) నుంచి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఈ విషయమై స్పందించాడు. సినీ పరిశ్రమకు ఎంతో ఉపసమనం కలగనుందని తెలిపారు. ఈ చట్టం కార్యరూపం దాల్చేందుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలను స్వాగతిస్తున్నట్లు బాలీవుడ్ నిర్మాత భూషన్ కుమార్ వెల్లడించారు. పైరసీ నిరోధానికి తీసుకువచ్చిన పార్లమెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. చట్ట సవరణకు సహకరించిన ప్రజా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణల చట్టం(Cinematograph amendment act) ఆమోదం పొందడంపై మరో బాలీవుడ్ ప్రముఖుడు, 91 ఫిల్మ్ స్టుడియో అధినేత నవీన్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర సమాచార శాఖా మంత్రి అనురాగ్ ఠాకుర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సినీ పైరసీ ఓ భూతం వంటిదని ఆయన అన్నారు. పైరసీకి పాల్పడే వారికి మూడేళ్ల జైలు శిక్ష, సినిమా నిర్మాణానికి అయిన ఖర్చులో 5 శాతం చెల్లించాలనే నిబంధన వంటివి పైరసీని అరికట్టడంలో సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పైరసీ కారణంగా ప్రతి ఏటా 25 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని నవీన్ చంద్ర తెలిపారు. అదే విధంగా సినిమాకు సెన్సార్ సర్టిటిఫికేట్ నిబంధనలు సవరించడంపై కూడా నవీన్ చంద్ర స్పందించారు. నిబంధనలు సరళతరం చేయడం సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. టెలివిజన్ కార్యక్రమాల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించడం కూడా వినోద పరిశ్రమకు కలిసివచ్చే విషయమని నవీన్ చంద్ర అన్నారు. ఇటువంటి కీలక సవరణలు చేసి బిల్లుకు ఆమోద ముద్ర వేసిన నరేంద్ర మోడీ(modi) ప్రభుత్వానికి నవీన్ చంద్ర ధన్యవాదాలు తెలిపారు. 40 ఏళ్ల తర్వాత సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరిస్తూ చారిత్రాత్మక బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు జరుగుతుందా లేదా అనే విషయం మరికొన్ని నెలల్లో తేలనుంది.