నిండా పద్దెనిమిదేళ్లు కూడా నిండలేదు. వందల కోట్లకు పడగలెత్తింది. పుట్టిన రోజు కోసం ఏం కొందామో తెలియక పొరపాటున కొన్న లాటరీ టికెట్ ఆమెను కోటీశ్వరాలిని చేసేసింది. తాత చెప్పిన మాటతో కొన్న లాటరీ టికెట్ తో ఆమెకు రూ.290 కోట్లు దక్కాయి. అదృష్టమంటే ఈ అమ్మాయిదే కదా. అయితే వచ్చిన ఆ డబ్బుతో ఆమె మెర్సిడెస్ బెంజ్ కార్లు, అత్యంత విలాసవంతమైన బంగ్లా కొనడంతో పాటు భవిష్యత్ దృష్ట్యా కొన్ని కోట్లు పెట్టుబడిగా పెట్టేసింది. ఒక్క టికెట్ తో ఆమె కుటుంబమంతా సెటిల్ అయిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కెనడాలోని ఒంటారియో ప్రాంతానికి చెందిన జులియెట్ లామర్ జనవరి 7వ తేదీన తన పుట్టిన రోజు చేసుకుంది. అంతకుముందు కొన్ని రోజుల కిందట తన తాత ఇచ్చిన డబ్బుతో ఏమైనా కొనాలని భావించింది. అయితే తాత సలహాతో ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. లాటరీ కొని మరచిపోయింది. ఇటీవల తన పుట్టిన రోజును ఘనంగా చేసుకుంది. ఇంటి పక్కన వాళ్లు లాటరీ గెలుచుకోవడంతో జులియెట్ కు వెంటనే తన లాటరీ గుర్తుకు వచ్చింది. మొబైల్ యాప్ లో తన టికెట్ చూడగా ఏకంగా రూ.290 కోట్లు (48 మిలియన్ డాలర్లు) నగదు బహుమతి సొంతం చేసుకుంది. ఇంకా ఆమె ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది.
అయితే వచ్చిన డబ్బులను కొన్ని రోజుల్లోనే ఖర్చు చేసేసి అరుణాచలం సినిమాను మించిపోయింది. వెంటనే రూ.2 కోట్లు విలువైన 5 మెర్సిడెస్ బెంజ్ కార్లు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అత్యంత విలాసవంతమైన భవనాన్ని రూ.40 కోట్లతో కొన్నది. ఇప్పుడు తాజాగా ఒక చార్టర్ విమానాన్ని రూ.వంద కోట్లతో కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక భవిష్యత్ అవసరాల కోసం రూ.150 కోట్లు పొదుపు చేయనున్నట్లు జులియెట్ తెలిపింది. కుటుంబ పరిస్థితుల కారణంగా జులియట్ డాక్టర్ కోర్సు చదవలేకపోయింది. ఇప్పుడు డబ్బులు రావడంతో తమ అమ్మాయిని డాక్టర్ ను చేయిస్తామని జులియెట్ కుటుంబసభ్యులు తెలిపారు. మిగిలిన డబ్బులను పెట్టుబడులుగా పెట్టనున్నట్లు ప్రకటించారు. ఒక్క లాటరీతో ఆ కుటుంబం దశ తిరిగిపోయింది.